ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఉన్నా అధికారం మాత్రం ఎమ్మెల్సీ దే ..

-

ఆయనో ఎమ్మెల్యే. పైగా అధికార పార్టీ..ఇంకేం ఉంది. పట్టిందల్లా బంగారమే. రాజభోగమే. కానీ అక్కడి పరిస్థితి వేరు. ఎమ్మెల్యే అంటారు. కానీ ఆయన పని ఇంకొకరు చేస్తారు. అధికారులు కూడా ఆయనకే జీ హుజూర్‌ అంటారు. గెలిచిన మొదట్లో ఉత్సాహం కొద్దీ కొన్ని నిర్ణయాలు తీసుకున్న ఎమ్మెల్యే.. అవి అమలు కాకపోవడంతో విషయం బోధపడిందట. ఇప్పుడు ఏకంగా 6 నెలలుగా కనిపించడమే మానేశారు. సీఎం సొంత జిల్లాలోని‌ ఆ ఎమ్మెల్యే పై ఆసక్తికర చర్చ జరిగిందట‌‌…

డాక్టర్‌ వెంకట సుబ్బయ్య. కడప జిల్లా బద్వేలు వైసీపీ ఎమ్మెల్యే. వైద్య వృత్తిలో ఉంటూ.. రాజకీయాల్లోకి వచ్చిన ఆయన తొలి ఎన్నికల్లోనే విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఎమ్మెల్యేగా గెలిచిన మొదట్లో బద్వేలులో విస్తృతంగా పర్యటించిన వెంకట సుబ్బయ్య.. ఆ తర్వాత నుంచి కనిపించడమే మానేశారు. ఈలోగా కరోనా వ్యాప్తి ఎక్కువ కావడంతో జనాల్లోకి రావడమే మానేశారట. కరోనా కారణంగా పనుల్లేక, తిండి లేక నియోజకవర్గంలో చాలా మంది కూలీలు ఇబ్బంది పడ్డారు. మిగతాచోట్ల ఎమ్మెల్యేలు ప్రజలకు నిత్యావసరాలు వంటివి పంపిణీ చేస్తుంటే డాక్టర్‌ వెంకట సుబ్బయ్య మాత్రం ఎక్కడున్నారో ఎవరికీ తెలియడం లేదట.

రవాణా శాఖ అధికారిగా ఉంటూ YS పిలుపు మేరకు రాజకీయాల్లోకి వచ్చి 2004లో ఎమ్మెల్యే అయ్యారు గోవిందరెడ్డి. ఒకసారి గెలిచాడో లేదో.. 2009లో నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. బద్వేలు ఎస్సీ రిజర్వ్‌డ్‌ అయ్యింది. గోవిందరెడ్డి ఆశలు గల్లంతయ్యాయి. కానీ. ఆయన పట్టుమాత్రం అలాగే ఉంది. నియోజకవర్గం అంతా గోవిందరెడ్డి కనుసన్నల్లోనే పనిచేస్తోంది. వివాద రహితుడిగా పేరున్న గోవిందరెడ్డికి YCP నాయకత్వం కూడా ప్రాధాన్యం ఇస్తోంది. అందుకే ఆయన్ను MLCగా కూడా చేశారు జగన్‌. ఆ నేపథ్యంలోనే బద్వేల్‌ అభ్యర్థి ఎంపిక బాధ్యతను ఆయనకు అప్పగించింది. ఇప్పుడున్న ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్యను ఎంపిక చేసింది గోవిందరెడ్డేనట. బద్వేల్‌లో ఏం చేయాలన్నా అధిష్ఠానం గోవిందరెడ్డి చెప్పినట్లే చేస్తుందట. గెలిచిన మొదట్లో ఉత్సాహం కొద్దీ కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు వెంకట సుబ్బయ్య. అయితే అవి అమల్లోకి, ఆచరణలోకి రాలేదు. దీంతో ఆయనకు విషయం బోధపడింది. తన పాత్ర పరిమితం అని త్వరగానే అర్థం చేసుకున్నారట. ఆ ఉదంతం తర్వాత ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్సీ గోవిందరెడ్డి చెప్పినట్లే తలూపడం నేర్చుకున్నారట.

బద్వేలులో ఏ పని కావాలన్నా పార్టీ కార్యకర్తలు ఎమ్మెల్సీ గోవిందరెడ్డి దగ్గరకే వెళ్తారు. ఎమ్మెల్యేను పలకరించే పరిస్థితి కూడా లేదట. పార్టీ కార్యకర్తలే కాదు.. అధికార యంత్రాంగానిది సైతం అదే వైఖరి అట. ఎమ్మెల్సీ ఇచ్చిన లేఖలనే పరిగణనలోకి తీసుకుంటారని టాక్‌. దీంతో పనులన్నీ ఆయన చేస్తుంటే ఇక నేనేందుకు అన్న ఫీలింగ్‌లోకి వచ్చారట ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య. అనవసరంగా జోక్యం చేసుకుని సమస్యలు కొని తెచ్చుకోవడం ఎందుకుని సైలెంట్‌ అయ్యారట. అయితే ఎమ్మెల్యే ఆరోగ్యం బాగో లేకపోవడం వల్లే నియోజకవర్గంలో పర్యటించడం లేదనే మరో వాదన ఉంది. శాసనసభ్యుడు కాకముందు నుంచే ఆయనకు ఆరోగ్య సమస్యలున్నా.. కారణం అది కాదని.. అంతా అనుకుంటున్నదేనని చెబుతున్నారట. సన్నిహితులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version