టీ కాంగ్రెస్ లో ఆ యూత్ లీడర్ ఏకు మేకయ్యాడా

-

అప్పట్లో అందరూ ఆయన్ని వ్యతిరేకించారు. ఓడించటానికి ఎవరికి వారు ఎత్తులు..పైఎత్తులు వేశారు. తీరా చూస్తే, అందరూ వ్యతిరేకించిన వ్యక్తే ఇప్పుడు యూత్ కాంగ్రెస్ నేతగా గెలిచాడు. ఇప్పుడు అందరికీ పోటీగా మారాడు.. ఏకంగా సీనియర్ నేత సీటు పైనే కన్నేశాడు…పాలమూరు నేతలకు మాత్రం పక్కలో బల్లెంలా తయారయిన ఆ నేత పై టీ కాంగ్రెస్ లో ఆసక్తికర చర్చ జరుగుతుంది.

తెలంగాణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా శివసేనారెడ్డి ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలు సాధారణ ఎన్నికల్ని తలపించేలా జరిగాయి. పీసీసీ చీఫ్ కి కూడా ఇంతపోటీ లేదనే టాకొచ్చింది. యూత్ కాంగ్రెస్ నాయకులే కాదు, అటు పార్టీలోని సీనియర్లు కూడా ఎవరికి వారు పావులు కదిపారు. తమ వాళ్లని గెలిపించుకునే ప్రయత్నాలు చేశారు. తమకు అండగా ఉంటారనుకున్న వాళ్లకు మద్దతు పలికారు. సభ్యత్వ నమోదులో పోటీ పడి 12 లక్షల మందిని చేర్పించారు. అయితే, ఇంత వ్యతిరేకించిన శివసేనా రెడ్డి గెలవటంతో చాలా మంది నాయకులు ఆయన్ని పక్కలో బల్లెంలా భావిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.

పాలమూరు జిల్లా, వనపర్తి నియోజకవర్గానికి చెందిన శివసేనా రెడ్డికి యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో మద్దతుగా నిలిచింది కేవలం కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర రెడ్డి మాత్రమే. అయితే, శివసేనా రెడ్డి టీం.. 18 జిల్లాల్లో పైచేయి సాధించింది. . అయితే, పాలమూరు జిల్లాకే చెందిన కీలక నాయకులు వంశీ చందర్ రెడ్డి, చిన్నారెడ్డి ఇద్దరూ శివసేనారెడ్డిని వ్యతిరేకించారు. అటు రేవంత్ రెడ్డి కూడా… మాజీ కేంద్రమంత్రి బలరాం నాయక్ కుమారుడికి మద్దతు పలికారు. దీంతో రేవంత్ వర్గం శివసేన రెడ్డి ని దగ్గరకు తీసుకోలేని, దూరం చేసుకోలేని పరిస్థితిలో పడింది. రేవంత్ కి కొత్త యూత్ అధ్యక్షుణ్ని దగ్గర చేసే ప్రయత్నం చేసే పనిలో మాజీ అధ్యక్షుడు అనిల్ ఉన్నారట.

నల్గొండ జిల్లాకు చెందిన రాంరెడ్డి దామోదర్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రమే బాహాటంగానే సపోర్ట్ చేస్తే, అటు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా… శివసేనారెడ్డి వ్యతిరేక వర్గానికే మద్దతు తెలిపారు. ఇలా పార్టీలో దాదాపు అందరు నాయకులు వ్యతిరేకించిన పరిస్థితిలో శివసేనారెడ్డి టీం ఎన్నికలు ఎదుర్కొని గెలిచింది. అయితే… ఇప్పుడు మిగిలిన జిల్లాల నాయకులకు పెద్ద ఇబ్బంది లేదు కానీ… పాలమూరు నేతలకు మాత్రం శివసేనా రెడ్డి పక్కలో బల్లెంలా తయారయ్యారనే టాక్ వస్తోంది.

కానీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి సిద్దమవుతున్న చిన్నారెడ్డికి…శివసేనా టీం మద్దతుగా నిలబడుతోంది. యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో చిన్నారెడ్డి వ్యతిరేకంగా పని చేసినా, ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్ని రకాలుగా సహకరించాలని నిర్ణయించిందట. అయితే, దీని వెనక పెద్ద స్కెచ్చే ఉందట. చిన్నారెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిస్తే… వనపర్తి లో శివసేనా రెడ్డి పోటీకి మార్గం సుగమం అవుతుందన్న వ్యూహం లో యూత్ కాంగ్రెస్ ఉందట.

ఎమ్మెల్సీ అభ్యర్థి పేరు ప్రతిపాదన లో కూడా యూత్ కాంగ్రెస్… మొదటి..రెండో ప్రాధాన్యత కూడా చిన్నారెడ్డి పేరే చెప్పిందట. యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో మద్దతు ఇవ్వకున్నా… శివసేనా టీం ఎమ్మెల్సీ ఎన్నికలకు చిన్నారెడ్డి కి అంతగా మద్దతు ఇవ్వడం తో అంతా అవాక్కయ్యారట.

Read more RELATED
Recommended to you

Exit mobile version