జ్యోతిష్య శాస్త్రంలో శని దేవుడిని న్యాయదేవతగా, కర్మ ఫలదాతగా భావిస్తారు. ఆయన ఏ దశలో ఉన్నా మన కర్మలను బట్టే ఫలితాలుంటాయి. అయితే శని గ్రహ ప్రభావాలలో ఒకటిగా చెప్పబడే అర్ధాష్టమ శని (Ardhastama Shani) దశ కొందరి జీవితంలో సుమారు రెండున్నర సంవత్సరాల పాటు ఉంటుంది. ఈ సమయాన్ని కొందరు సవాళ్లుగా భావిస్తారు. ఈ దశలో మానసిక ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు లేదా అనవసర ప్రయాణాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ సమయంలో భయపడకుండా కొన్ని ముఖ్యమైన ఆధ్యాత్మిక, వ్యక్తిగత జాగ్రత్తలు పాటించడం ద్వారా ఆ కాలాన్ని సాఫీగా దాటవచ్చు. మరి వాటి గురించి తెలుసుకుందాం..
ప్రతి ఒక్కరి జీవితం ఒకలాగా ఉండదు. జాతకం అనేది మనం పుట్టినప్పుడే నిర్ణయం అవుతుందని పెద్దలు చెబుతారు.ఇక జాతకం లో శని 7 సంవత్సరాలు,కొందరికి ఇంకా ఎక్కువ సంవత్సరాలు వుంటుంది. మరి అర్ధాష్టమ దశలో ఉన్నప్పుడు తప్పక పాటించాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు తెలుసుకోవటం ముఖ్యం.
శని ఆరాధన: ప్రతి శనివారం తప్పకుండా శని దేవుడిని ఆరాధించడం ముఖ్యం. నువ్వుల నూనె లేదా నల్లని వస్త్రాలను దానం చేయడం, నల్ల నువ్వులు కలిపిన అన్నం కాకులకు పెట్టడం లేదా శివాలయంలో రుద్రాభిషేకం చేయించడం చాలా శుభకరం.
హనుమాన్ పూజ: శని ప్రభావం తగ్గడానికి హనుమంతుడి ఆరాధన అద్భుతమైన మార్గం. ప్రతి మంగళవారం, శనివారం హనుమాన్ చాలీసా లేదా సుందరకాండ పారాయణం చేయడం ద్వారా శని బాధలు ఉపశమిస్తాయి.

సేవా గుణం: పేదవారికి, వృద్ధులకు ముఖ్యంగా దివ్యాంగులకు లేదా పారిశుద్ధ్య కార్మికులకు సహాయం చేయడం. దుప్పట్లు లేదా చెప్పులు దానం చేయడం ద్వారా శని దేవుడు ప్రసన్నుడవుతాడు. శని దేవుడు సేవకులను ఇష్టపడతాడు అని నమ్మకం.
వ్యక్తిగత జాగ్రత్తలు: ఈ సమయంలో ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాలు పెద్ద పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆలస్యంగా, ఆచితూచి వ్యవహరించాలి. అనవసర వాదనలకు కోపానికి దూరంగా ఉండటం, ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండటం అవసరం.
శని అర్ధాష్టమ దశ అనేది మన కర్మలను సరిదిద్దుకోవడానికి, ఆధ్యాత్మికంగా ఎదగడానికి లభించే ఒక అవకాశం. ఈ జాగ్రత్తలు పాటిస్తూ నిస్వార్థ సేవ మరియు నిరంతర దైవ స్మరణతో ఈ కాలాన్ని గడిపినట్లయితే శని దేవుడి ఆశీస్సులు లభించి, కష్టాల నుండి బయటపడటమే కాక, భవిష్యత్తుకు శుభప్రదమైన పునాది వేసుకోగలుగుతారు అని పండితులు తెలుపుతున్నారు.
గమనిక: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని అర్ధాష్టమ దశ ప్రభావాలు ప్రతి వ్యక్తి రాశి, జన్మ జాతకం బట్టి మారుతూ ఉంటాయి. మీకు సంబంధించిన పూర్తి వివరాల కోసం, దయచేసి ఒక అనుభవజ్ఞుడైన జ్యోతిష్య పండితుడిని సంప్రదించడం ఉత్తమం.