తాజాగా జరిగిన ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమం ద్వారా వైఎస్ షర్మిళ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారారు. దీంతో… మాటల్లో పరిపక్వత, వైఎస్ హావబావాలు కలగలిపి రాజకీయ నాయకురాలయ్యే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయంటూ ఆమె అభిమానులు తెగ హడావిడి చేస్తున్నారు. ఆ ఇంటర్వ్యూ సాగిన విధానం.. ఆమెపై సానుభూతి కలిగేలా ఆర్కే సంధించిన ప్రశ్నలు కలగలిపి… ఇప్పుడు షర్మిళకు ఒక వర్గం ఫ్యాన్ బెల్ట్ తయారయ్యిందనే కామెంట్లు మొదలైపోయాయి!
అవును… ప్రస్తుతం ఏపీ కేంద్రంగా వైఎస్ జగన్ శతృవర్గం మొత్తం గంపగుత్తగా వైఎస్ షర్మిళ ఫ్యాన్స్ అయిపోయినట్లుగా సోషల్ మీడియాలో కామెంట్లు హల్ చల్ చేస్తున్నాయి. వాస్తవం కూడా అలానే ఉందనే కామెంట్లు చేస్తున్నారు విశ్లేషకులు. వైఎస్ జగన్ పేరెత్తితే అంతెత్తున లేచే ఎల్లో మీడియా… ఇప్పుడు షర్మిళకు ఫ్యాన్స్ అయినపోయినట్లేననేది ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ఇంటర్వ్యూని బట్టి అర్ధం అవుతుందంట.
ఇదే క్రమంలో జగన్ కు పక్కలో బల్లెంలా తయారయ్యారనే పేరు సంపాదించుకున్న ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణం రాజు కూడా ఇప్పుడు షర్మిళపై ప్రేమ, జాలి చూపించేస్తున్నారు. జగన్ తో సమానంగా పాదయాత్ర చేసి, ప్రచారంలో పాల్గొని వైఎస్సాసీపీ విజయానికి కారణమైన షర్మిలతో తమకు సంబంధంలేదని సజ్జల రామకృష్ణారెడ్డి అనడం దురదృష్టకరమని ఆర్.ఆర్.ఆర్. చెబుతున్నారు. పరోక్షంగా షర్మిళకు మద్దతుగా మాట్లాడటం మొదలుపెట్టారు.
ఇదే క్రమంలో తన గెలుపులో జగన్ పాత్ర కంటే తనపాత్రే ఎక్కువని చెప్పుకుంటున్న ఆర్.ఆర్.ఆర్… తన గెలుపులో షమిళ పాత్ర కూడా ఉందనే పరోక్ష వ్యాఖ్యలు చేశారు! తన పార్లమెంటు నియోజవర్గం పరిధిలో షర్మిల నాలుగు చోట్ల ప్రచారం చేశారని.. జనం కూడా బాగా వచ్చారని.. పార్టీ కోసం, ఎన్నికల కోసం జగన్ కంటే ఎక్కువగా షర్మిళే కష్ట పడ్డారని చెప్పుకొస్తున్నా రఘురామ.
దీంతో… అటు ఎల్లో మీడియా – ఇటు ఆర్.ఆర్.ఆర్. తో మొదలైన వైఎస్ షర్మిళ సానుభూతి వర్గం అలా పెరుగుతూ పోతుందని.. యాంటీ జగన్ బ్యాచ్ అంతా ఇప్పుడు జై షర్మిళ అనే మాటలు ఇంకా బహిరంగంగా, బలంగా వినిపించే సూచనలు ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు! మరి ఈ విషయంలో ఇంకెంతమంది షర్మిళకు మద్దతుగా నిలుస్తారనేది వేచి చూడాలి!