తెలంగాణ రాజకీయాల్లోకి ఊహించని విధంగా దివంగత వైఎస్సార్ కుమార్తె వైఎస్ షర్మిల ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఏపీలో షర్మిల సొంత అన్న వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పటికీ.. అక్కడ రాజకీయాలు చేయకుండా షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ పెట్టి రాజన్న రాజ్యం తీసుకోస్తానని చెబుతున్నారు. అంతేకాదు.. తెలంగాణ కోడలిగా పోరాటాలు చేస్తానని ప్రకటిస్తున్నారు. ఇప్పటికే పార్టీ ఏర్పాటుకు షర్మిల ప్రక్రియ పూర్తి చేశారు.
అయితే… తాజాగా జులై 8న పార్టీ ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో విధివిధానాలు ప్రకటించింది షర్మిల బృందం. ఆ వివరాల్లోకి వెళితే… బెంగళూరు నుంచి 8వ తేదీన బై రోడ్ లో వైఎస్ షర్మిల ఇడుపులపాయకు చేరుకోనున్నారు. ఈ నెల 8వ తేదీ ఉదయం ఇడుపుల పాయలో 8.30 గంటలకు ప్రార్థనలు చేయనున్నారు షర్మిల.
అనంతరం… కడప నుంచి ప్రత్యేక చాపర్ లో 2 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్ట్ చేరుకోనున్నారు వైఎస్ షర్మిల. 3 గంటలకు పంజాగుట్ట చౌరస్తాలో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించనున్న వైఎస్ షర్మిల… 4 గంటలకు JRC కన్వెన్షన్ కు చేరుకోనున్నారు. అనంతరం 5 గంటలకు పార్టీ ఆవిర్భావ ప్రకటన చేయనున్నారు.