చాలా రోజులుగా కాంగ్రెస్ అధినేత సీటు ఖాళీగా ఉంటోంది. అయితే ఆ సీటును భర్తీ చేసి పార్టీని గాడిన పెట్టాలని హైకమాండ్ యోచిస్తోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎవరిని నియమించాలనే దానిపై తర్జనభర్జన పడుతోంది. తదుపరి కాంగ్రెస్ అధినేతగా చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. తాజాగా ఆ జాబితాలో కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ పేరు కూడా చేరింది.
అయితే శశిథరూర్ని అధ్యక్షుడిగా నియమించడానికి సోనియా గాంధీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. పార్టీలో సంస్కరణలు రావాలని శశి థరూర్ బహిరంగ ప్రకటన చేసిన కొన్ని గంటల్లోనే సోనియాతో సమావేశమయ్యారు. కాగా.. కాంగ్రెస్‌లో సంస్కరణల కోసం గత కొన్నేళ్లుగా ఒత్తిడి చేస్తున్న సీనియర్ నేతల్లో థరూర్ కూడా ఉండటం గమనార్హం.
మరోవైపు.. కాంగ్రెస్ సారథ్య బాధ్యతల్ని చేపట్టాలంటూ ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై ఒత్తిడి రోజురోజుకీ పెరుగుతోంది. ఏఐసీసీ పగ్గాలు చేపట్టకూడదన్న భావనతో ఆయన ఉన్నట్టు వార్తలు వస్తున్న వేళ రాహులే సారథ్య బాధ్యతలు చేపట్టాలంటూ పలు రాష్ట్రాల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. రాహుల్ గాంధీనే పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలంటూ ఇప్పటికే రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్ వంటి రాష్ట్రాల పీసీసీలు ఏకగ్రీవంగా తీర్మానాలు చేసి ఏఐసీసీకి పంపగా.. తాజాగా ఆ జాబితాలో తమిళనాడు, మహారాష్ట్రలు చేరాయి.