మూడు దశాబ్దాల కిందట కశ్మీర్ నుంచి కశ్మీరి పండిట్ల సామూహిక బహిష్కరణను నేపథ్యంగా తీసుకుని ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు విధు వినోద్ చోప్రా ఒక ప్రేమకథా చిత్రాన్ని నిర్మించారు. గత శుక్రవారం ‘షికారా’ టైటిల్‌తో విడుదలైన ఈ సినిమాపై కొంతమంది నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ఈ సినిమాలో వినోద్ చోప్రా వాస్తవాలను వక్రీకరించాడని విమర్శలు చేశారు.
విధు వినోద్ చోప్రా కశ్మీరీ పండిట్ల దుస్థితిని తన స్వలాభం కోసం ఉపయోగించుకున్నాడని గత వారం రోజులుగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వ్యాపారపరమైన లాభాల కోసమే దర్శకుడు కశ్మీరీ పండిట్ల దీనావస్థను వక్రీకరించి చూపించాడని వారు విమర్శలు గుప్పిస్తున్నారు. కశ్మీర్ నుంచి కశ్మీరీ పండిట్లను బహిష్కరించిన ఘటనను చూపించాడుగానీ, ఈ సందర్భంగా కశ్మీరీ పండిట్లపై జరిగిన ఘోరాల గురించి ప్రస్తావించలేదని ఫైర్ అవుతున్నారు.
అయితే, ఈ విమర్శలపై ‘షికారా’ దర్శకుడు వినోద్ చోప్రా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నేను వ్యాపార లాభాల కోసం సినిమా తీశానని ఆరోపించేవారు ‘గాడిదలు’ అంటూ ఘాటైన పదజాలం ఉపయోగించారు. అప్పట్లో 4 లక్షల మంది కశ్మీరీలను అతిదారుణంగా అక్కడి నుంచి గెంటివేశారని, అలా గెంటివేయబడ్డ వారిలో తన తల్లి కూడా ఒకరని చోప్రా తెలిపారు. తన తల్లి జ్ఞాపకార్థమే తాను 11 సంవత్సరాలు శ్రమించి ‘షికారా’ సినిమా తీశానని ఆయన వెల్లడించారు.
‘అయినా నేను త్రీ ఇడియట్స్ సినిమా తీస్తే మొదటిరోజే రూ.33 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. కానీ షికారా సినిమాకు మొదటిరోజు వచ్చిన కలెక్షన్లు కేవలం 30 లక్షల రూపాయలే. రూ.33 కోట్లు వచ్చిన్నాడు వ్యాపారం అనని వాళ్లు, ఇప్పుడు రూ.30 లక్షలకే వ్యాపారం అని ఆరోపణలు చేయడం వింతగా ఉంది. నిజంగా ఇలాంటి వింత ఆలోచనలు గాడిదలకే వస్తాయి’ అని వినోద్ చోప్రా అగ్రహం వ్యక్తంచేశారు.