చనిపోయిన వ్యక్తి మరల బ్రతికి వచ్చాడు. అదేంటి చనిపోయిన వ్యక్తి బ్రతికి రావడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా. ఇది నిజమే ఓ వ్యక్తి మరణించాడని నిర్ధారించిన మూడు గంటల తర్వాత తిరిగి బతికి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు.ఈ సంఘటన కెన్యాలో జరిగింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కెన్యాకు చెందిన 32 ఏళ్ల పీటర్ కిగెన్ ఇంట్లో అప్పటిదాకా సరదాగా నవ్వుతూ గడిపాడు. అయితే ఏమైందో ఏమోగాని అకస్మాత్తుగా కళ్లు తిరిగి పడిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే అతడిని కాప్కాటెట్ ఆసుపత్రికి తరలించారు. సాయంత్రం 5.30 గంటలకు కళ్లు తిరిగి పడిపోయిన పీటర్ రాత్రి 07.45 గంటలకు చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అనంతరం శవాల గదిలో అతడి పార్థివ దేహాన్ని ఉంచారు. అంత్యక్రియ కార్యక్రమాల్లో నిమగ్నమైన వర్కర్లు ఆ గదిలో జరిగిన సంఘటన చూసి నిర్ఘాంత పోయారు.
ఇక కిగెన్ మేల్కొని నొప్పితో అరవడం ప్రారంభించాడు. దీంతో అక్కడున్న షాక్ తిన్నారు. ఓ వైపు భయపడుతూనే.. వైద్యులను పిలిచారు. వైద్యులు అతడిని పరీక్షించి ఏమి కాలేదని నిర్ధారించి వదిలేశారు. అయితే తను కళ్లు తిరిగి పడిపోవడానికి కారణమేంటో తనకు తెలియదని కిగెన్ ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. దేవుడు తనకు రెండో జీవితాన్ని ఇచ్చాడని, తన మిగిలిన జీవితాన్ని భగవంతుడి సేవలో గడుపుతానని ప్రకటించాడు కిగెన్.
అయితే ఈ మొత్తం తతంగంలో తప్పు ఎవరిదనేది మాత్రం తెలియలేదు. డాక్టర్లతో పాటు పీటర్ కిగెన్ సోదరుడు కూడా పొరబడ్డాడు. వైద్యులు కిగెన్ మృతి పట్ల అతడి సోదరుడిని చూపించగా.. అతడు కూడా పీటర్ చనిపోయినట్లు భ్రమపడ్డాడు. అంతేకాకుండా మార్చురీ రూమ్‌కు ఎలాంటి మరణ ధ్రవీకరణ పత్రం లేకుండానే మార్చారు. ఊహించని విధంగా మరణాన్ని దాటి వచ్చిన పీటర్ కిగెన్‌ను చూసి కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఇలాంటి ఘటన ఉత్తరప్రదేశ్ లోని మీరట్లో కూడా చోటు చేసుకుంది. దిల్లీలో ఓ మహిళ ఇలాగే చనిపోయినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. సరిగ్గా అంత్యక్రియలకు ముందు ఆమె మేల్కొవడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అయితే ఈ ఘటనలో డాక్టర్లు ఆమె చనిపోయినట్లు తప్పుగా నిర్ధారించారు. ఇలాంటివి మనదేశంలో ఇంకా చాలానే జరిగాయి.