బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లగా.. వెళ్లని నేతలపై అధికార పార్టీ కేసులు పెడుతోందని గులాబీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. తాజాగా మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిపై చీటింగ్ కేసు నమోదైంది.
డబ్బులు చెల్లింపు విషయంలో తనను మోసం చేశాడని ఓ వ్యక్తి పోలీసులను ఆశ్రయించగా చీటింగ్ కింద ఎఫ్ఐఆర్ నమోదైంది.విజన్ ప్రాపర్టీ మేనేజ్మెంట్ సర్వీస్ అనే సంస్థతో ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డికి చెందిన అరుంధతి హాస్సిటల్స్ టైఅప్ అయ్యింది.ఆ టైంలో అరుంధతి హాస్పిటల్‌కు 40 మంది సిబ్బందిని విజన్ ప్రాపర్టీ మేనేజ్మెంట్ సర్వీస్ నుంచి కేటాయించాలని యేసు బాబు, రాజశేఖర్ రెడ్డి మధ్య ఒప్పందం కుదిరింది. అందుకు ఎమ్మెల్యే రూ.50 లక్షలు చెల్లిస్తానని చెప్పి.. రూ.30లక్షలు చెల్లించారు. మిగతా రూ.20లక్షలు చెల్లించకపోవడంతో పాటు ఎన్ని సార్లు అడిగినా సమాధానం లేకపోవడంతో యేసుబాబు పోలీసులను ఆశ్రయించగా.. వారు చీటింగ్ కేసు కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిసింది.