రాజ్యాంగాన్ని నాశనం చేసే పార్టీగా కాంగ్రెస్ మారిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అంబేడ్కర్ సమానత్వాన్ని తీసుకురావాలని, ప్రతి పేదవాడు గౌరవంగా తల ఎత్తుకుని జీవించాలని కోరుకున్నారని తెలిపారు. కానీ కాంగ్రెస్ మాత్రం ఓటు బ్యాంకు రాజకీయాల వైరస్‌ను వ్యాప్తి చేసి పేదవాడి కలలను అడ్డుకుందని విమర్శించారు. అంబేడ్కర్ బ్రతికి ఉన్నప్పుడు ఆయన్ను హస్తం పార్టీ రెండు సార్లు ఎన్నికల్లో ఓడిపోయేలా చేసి అవమానించిందని ఆరోపించారు.
హర్యానాలో పర్యటించిన ప్రధాని మోదీ సోమవారం హిసార్ విమానాశ్రయం నుంచి అయోధ్యకు తొలి వాణిజ్య విమానాన్ని ప్రారంభించారు. హిసార్ ఎయిర్‌పోర్ట్‌లో కొత్త టెర్మినల్, ఇతర అభివృద్ధి ప్రాజెక్టులకు భూమి పూజ చేసిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ వక్ఫ్ రూల్స్‌ను తమ స్వార్థానికి మార్చేసిందని ఆరోపించారు. వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ పార్టీ “ఓటు బ్యాంకు వైరస్”ను వ్యాప్తి చేసిందని.. ఎస్సీ, ఎస్టీ వాళ్లను రెండో తరగతి పౌరులుగా చూస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు.