సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల తమ పార్టీ ప్రజాప్రతినిధుల పనితీరుపై రహస్యంగా ఓ సర్వే చేయించినట్లు తెలిసింది. అందులో షాకింగ్ నిజాలు వెలుగుచూసినట్లు తెలుస్తోంది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 26 మంది ఎమ్మెల్యేలు రెడ్జోన్లో ఉన్నట్లు తేలింది. కాంగ్రెస్ గెలిచిన 65 అసెంబ్లీ సెగ్మంట్లతో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఇతర సెగ్మంట్లపై కూడా సీఎం రేవంత్ థర్డ్ పార్టీ సర్వే చేయించినట్లు తెలుస్తోంది.
ఈ సర్వేలో ముఖ్యంగా ఎమ్మెల్యేలు, ప్రభుత్వం పనితీరు, జిల్లా లేదా స్థానిక స్థాయిలో పరిపాలన మరియు ప్రజల ఆశయాలపై దృష్టి సారించగా..26 మంది ఎమ్మెల్యేలు రెడ్ జోన్లో, 14 మంది ఆరెంజ్ జోన్లో, మిగతా వారు సేఫ్ జోన్లో ఉన్నారని సర్వే వర్గాలు తెలిపాయి. సర్వే ప్రకారం కొంతమంది మంత్రులు వారి నియోజకవర్గాల్లో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటుండగా.. కొందరు ఎమ్మెల్యేలు తమ సెగ్మంట్లలో అభివృద్ధిని నిర్లక్ష్యం చేసి తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు. రెడ్ జోన్లో ఉన్న ఎమ్మెల్యేలు తమ సెగ్మంట్లను వదిలి హైదరాబాదులో ఎక్కువ టైం గడుపుతూ వారి వ్యాపార ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు విమర్శలొస్తున్నాయి.
మరికొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అక్రమ కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నారని, వీరిలో 8 నుంచి 10 మంది ఇసుక అక్రమ రవాణా, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పంక్తులు కలిగించే కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నారని సర్వేలో వెల్లడైంది.ఇక ఆరెంజ్ జోన్లోని ఎమ్మెల్యేలు ప్రజల సమస్యలను పరిష్కరించడంలో విఫలమై, పార్టీ కార్యకర్తలు, స్థానిక నాయకులతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు తేలింది. దావోస్ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత రెడ్ జోన్,ఆరెంజ్ జోన్ ఎమ్మెల్యేలతో వరుసగా భేటీ అవ్వాలనే యోచనలో ఉన్న సీఎం రేవంత్ ఉన్నట్లు తెలుస్తోంది.