భార్య కాపురానికి రావడం లేదని మద్యానికి బానిసైన ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఏటూరునాగారం మండల కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన గంజి రంజిత్ (32) యువకుడు వృత్తి రీత్యా పెయింటింగ్ పని చేసుకుంటూ జీవనం సాగించేవాడు. అతను పినపాకకు చెందిన మహిళను వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికి గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. దీంతో భార్య రెండు సంవత్సరాలుగా కాపురానికి రావడం లేదని సమాచారం.
భార్య కాపురానికి రావడం లేదని తీవ్ర మనస్థాపానికి గురైన రంజిత్.. ప్రతి రోజూ మద్యం సేవిస్తూ ఉండేవాడు.ఈ క్రమంలోనే ఆదివారం మద్యం మత్తులో జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఎవరూ లేని టైంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న ఏటూరునాగారం ఏస్ఐ తాజుద్దీన్ ఘటనా స్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏటూరునాగారం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.