అడవిలో ఉండాల్సిన చిరుత అనుకోకుండా రోడ్డు పైకి రావడంతో మృత్యువు కబలించింది. ఈ దారుణ ఘటన చూసిన వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు.ఆహారం కోసం వెతుక్కుంటూ అడవిలో ఉండే చిరుత బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇంతలో చిరుతను మృత్యువు వెంటాడింది.ఈ విషాద ఘటన నెల్లూరు జిల్లా సింగనపల్లి అటవీ ప్రాంతంలో ఆలస్యంగా వెలుగుచూసింది.
సింగనపల్లి అటవీ ప్రాంతంలో సంచరించే చిరుత విజయవాడ జాతీయ రహదారి పైకి రాగా, గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంతో చిరుత తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.అచేతన స్థితిలో పడియున్న చిరుతను చూసిన స్థానికులు భయంతో దాని వైపు వెళ్లలేదు.రక్తపు గాయాలతో సుమారు గంట పాటు ప్రాణాలతో కొట్టుమిట్టాడిన చిరుత..చివరకు ప్రాణాలు కోల్పోయింది. విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. చిరుత మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పంచనామా నిర్వహించి అటవీ ప్రాంతంలో పూడ్చిపెట్టారు.