ఎస్సై గోవింద్ ఓ చిన్నారిని బుట్టలో వేసుకుని దాన్ని తలపై పెట్టుకుని సుమారుగా 1.5 కిలోమీటర్ల దూరం పీకల్లోతు నీటిలో నడుచుకుంటూ వచ్చి రక్షించాడు. అలా గోవింద్ ఆ చిన్నారిని తీసుకువస్తున్నప్పుడు దాన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ వీడియో కాస్తా వైరల్ అయింది.
భారీ వర్షాల కారణంగా గుజరాత్‌లోని వడోదర నగరం నీట మునిగింది. రహదారులపై పెద్ద ఎత్తున వరదనీరు వచ్చి చేరి రోడ్లు చిన్నపాటి సరస్సులను తలపిస్తున్నాయి. గత 3, 4 రోజులుగా అక్కడ కురుస్తున్న కుంభ వృష్టితో జనజీవనం స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునగడంతో అక్కడి ప్రజలు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్నీ కావు. కాగా తాజాగా అక్కడి ఓ ప్రాంతం మొత్తం వరద నీటిలో మునిగిపోవడంతో సహాయక చర్యల కోసం వచ్చిన ఓ ఎస్ఐ ఎంతో శ్రమకోర్చి ఓ చిన్నారిని కాపాడాడు. దీంతో ఆ వీడియో ఇప్పుడు నెట్‌లో వైరల్ అవుతోంది.
వడోదరలోని విశ్వామిత్ర నది సమీపంలో ఉన్న దేవీపుర ప్రాంత ఎస్సై గోవింద్ చద్వాకు సమాచారం వచ్చింది. వరద నీటిలో ఓ గ్రామవాసులు చిక్కుకున్నారని తెలియడంతో ఆయన వెంటనే పోలీసు సిబ్బందితో కలిసి గ్రామస్థులను రక్షించడం కోసం ఆ ప్రాంతానికి వెళ్లాడు. అయితే ఆ ప్రాంతమంతా సుమారుగా 5 అడుగుల లోతు నీళ్లలో మునిగింది. దీంతో జనాలను తాడు సహాయంతో అవతలికి తరలించారు. ఈ క్రమంలోనే ఎస్సై గోవింద్ ఓ చిన్నారిని బుట్టలో వేసుకుని దాన్ని తలపై పెట్టుకుని సుమారుగా 1.5 కిలోమీటర్ల దూరం పీకల్లోతు నీటిలో నడుచుకుంటూ వచ్చి రక్షించాడు. కాగా అలా గోవింద్ ఆ చిన్నారిని తీసుకువస్తున్నప్పుడు దాన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ వీడియో కాస్తా వైరల్ అయింది. ఈ క్రమంలో ఆ చిన్నారిని రక్షించిన ఎస్సై గోవింద్‌ను అందరూ ఇప్పుడు అభినందిస్తున్నారు.
Proud of the humanitarian work of this cop in Vadodara. Great courage & dedication. Rescued the baby & family. #VadodaraRains #sdrf #NDRF @GujaratPolice @IPS_Association pic.twitter.com/wWEVcJu3Ho
— Dr. Shamsher Singh IPS (@Shamsher_IPS) August 1, 2019
Video clip of rescue operation of baby of 45 days by cop Govind Chavda pic.twitter.com/vOgj3Fe6lv
— Dr. Shamsher Singh IPS (@Shamsher_IPS) August 1, 2019
కాగా వడోదరలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అక్కడ ఇప్పుడు చాలా వరకు రహదారులు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. ఈ క్రమంలో వర్షాల వల్ల అక్కడ ఇప్పటికే 6 మంది మృతి చెందారు. ఇక వరద నీటిలో చిక్కుకున్న అనేక ప్రాంతాల వాసులను రక్షించేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. గత 2 రోజుల వ్యవదిలోనే వడోదరలో ఏకంగా 50 సెంటీమీటర్ల వర్షం కురిసిందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే వర్షాలు ఇంకా ఎక్కువగానే ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారు హెచ్చరిస్తున్నారు.