దుబ్బాక ఉపఎన్నిక వేళ ఆ అధికారి అత్యుత్సాహమే వేటుకు కారణమైందా ఎన్నికల్లో పోటీ చేస్తానని లీకులు ఇచ్చారా..దుబ్బాక ఉప ఎన్నిక గడువు సమీపిస్తున్న సమయంలో సిద్ధిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి ఆకస్మిక బదిలీ పెద్ద చర్చకు దారితీసింది. ఈ ట్రాన్స్‌ఫర్ వెనక పెద్ద తతంగమే నడిచిందని టాక్. ప్రభుత్వం చాలా మల్లగుల్లాలు పడినట్టు సమాచారం. కొత్త జిల్లాలు ఏర్పడినప్పటి నుంచి వెంకట్రామిరెడ్డి సిద్ధిపేట కలెక్టర్‌గా కొనసాగుతున్నారు. అసెంబ్లీ ముందస్తు ఎన్నికలకు ముందు సిరిసిల్ల కలెక్టర్‌గా వెళ్లారు. టీఆర్‌ఎస్ రెండోసారి అధికారం చేపట్టాక తిరిగి సిద్ధిపేటకు వచ్చేశారు వెంకట్రామిరెడ్డి.
ప్రభుత్వంతో దగ్గరగా ఉండే అధికారుల్లో వెంకట్రామిరెడ్డి ఒకరని చెబుతారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. దుబ్బాక సిట్టింగ్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి చనిపోయిన వెంటనే ఉప ఎన్నికలో తానే పోటీ చేస్తానని లీకులు ఇవ్వడం ప్రారంభించారట కలెక్టర్. ప్రభుత్వ పరిశీలనలో తన పేరు ఉందని.. ఏమైనా జరగొచ్చని తన సన్నిహితుల ద్వారా ప్రచారం చేసకున్నట్టు సమాచారం. ఒకానొక దశలో వెంకట్రామిరెడ్డి వాలంటరీ రిటైర్మెంట్‌కు దరఖాస్తు చేశారని.. ఉపఎన్నికలో పోటీ చేయడమే లాంఛనమని అధికార వర్గాల్లో చర్చ జరిగింది. అసెంబ్లీ ముందస్తు ఎన్నికల్లో సైతం సంగారెడ్డి లేదా సిద్ధిపేట జిల్లాల్లో ఒక నియోజకవర్గం టీఆర్‌ఎస్ టికెట్ వస్తుందని.. త్వరలో అధ్యక్షా అనడమే మిగిలిందని వెంకట్రామిరెడ్డి చెప్పారట.
ఈ చిట్టా మొత్తం బయటకు తీసిన విపక్ష పార్టీలు కలెక్టర్ వెంకట్రామిరెడ్డిని కార్నర్ చేశాయి. ప్రభుత్వానికి, టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఉండే అధికారి కలెక్టర్‌గా ఉంటే బై ఎలక్షన్ నిష్పక్షపాతంగా జరగబోవని ఫిర్యాదులు చేశాయి. ఈ విషయం తెలుసుకున్న ఎన్నికల అధికారులు.. వెంకట్రామిరెడ్డిని బదిలీ చేయాలని ప్రభుత్వానికి సూచించారట. ఈ సమస్య పెద్దది కాకుండా ప్రభుత్వం ఆకస్మికంగా వెంకట్రామిరెడ్డిని సంగారెడ్డికి ట్రాన్స్‌ఫర్ చేసింది. మొత్తానికి కలెక్టర్ అత్యుత్సాహం మొదటికే మోసం తెచ్చిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.