బుద్ధుడు శిష్యపరంపర ఇదే !

-

బుద్ధుడు బోధి వృక్షం కింద జ్ఞానం సంపార్జించిన తర్వాత ఆయన శిష్యులుగా చేరిన వారిలో రాజులు, రాణులు, యువరాజులు, పండితుల నుంచి సామాన్యుల వరకు ఎందరో ఉన్నారు.. ఆ విశేషాలు తెలుసుకుందాం..

గౌతమ బుద్ధుడు తపుస్సా, భల్లక అనే ఇద్దరు వర్తకులను తన ప్రథమ శిష్యులుగా చేసుకున్నాడు. వారికి గౌతమబుద్ధుడు తన తల నుండి కొన్ని వెంట్రుకలను ఇచ్చాడనీ, వాటిని ఇప్పటికీ రంగూన్ లో ఉన్న ఘ్యూ డాగన్ ఆలయంలో భద్రపరిచారానీ ప్రజలు ఇప్పటికీ నమ్ముతున్నారు. గౌతమబుద్ధుడు ఉత్తర భారతదేశంలో ఉన్న వారణాశిలో ఒక లేళ్ళ ఉద్యానవనంలో, కౌడిన్య దగ్గర తనతో పాటు శిష్యరికం చేసిన మిగతా ఐదుగురు సన్యాసులకు తాను తెలుసుకున్న పరమసత్యంపై మొదటి ఉపన్యాసం ఇచ్చాడు. వీరు అందరూ కలిసి మొదటి బౌద్ధ భిక్షవుల సంఘాన్ని ఏర్పరచి బుద్ధం, ధర్మం, సంఘం అనే మూడు సూత్రాలతో కూడిన మొదటి బౌద్ధమత సంఘం ఏర్పడింది.

తరువాత యాసుడు అతని 54 మంది మిత్రుల చేరికతో బౌద్ధమత సంఘం 60 సంఖ్యను దాటింది. తరువాత ముగ్గురు కశ్యప సోదరులు వారి 200, 300, 500 మంది శిష్యుల చేరికతో బౌద్ధమత సంఘంలోని వ్యక్తుల సంఖ్య 1000 దాటింది. గౌతమబుద్ధుడు గంగా పరివాహక ప్రాంతాలైన ఉత్తరప్రదేశ్, బీహార్ మరియు దక్షిణనేపాల్ ప్రాంతాలలో పర్యటించి విభిన్న సామాజిక వర్గాలకు చెందిన ప్రజలకు తన బోధనలు. సిద్ధాంతాలను బోధించాడు. బుద్దుడికి జ్ఞానోదయం అయిన విషయం తెలుసుకున్న శుద్దోధకుడు బుద్ధుడిని కపిలవస్తుకు తిరిగి రమ్మని రాజదూతలతో కబురు పంపించగా తొమ్మిది మంది కూడా బౌద్ధ సంఘంలో చేరి సన్యాసులుగా మారిపోయారు.

బుద్ధుడి బాల్య స్నేహితుడు కులుదాయి మాత్రం రాజ్య ఆహ్వానాన్ని బుద్ధుడికి చెప్పి బౌద్ద సంఘంలో చేరిపోయాడు. బుద్ధుడు రెండు సంవత్సరాల తరువాత తన తండ్రి శుద్దోదకుడి ఆజ్ఞను అనుసరించి కాళి నడకన కపిలవస్తుకు ప్రయాణం అయ్యాడు. మార్గమధ్యంలో ధర్మబోధ చేస్తూ రెండు మాసాలలో కపిలవస్తుకు చేరుకుని రాజభవనంలో బౌద్ధ సంఘానికి మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశాడు. కానీ బౌద్ధ సంఘానికి ఎలాంటి ఆహ్వానం రాకపోవడంతో వారంతా బుద్ధుడితో కలిసి భిక్షాటనకు బయలుదేరారు. ఈ విషయం తెలుసుకున్న శుద్దోధకుడు ‘మనది మహామస్సాట రాజవంశం, మన వంశంలో ఎవరూ భిక్షాటన చేయలేదు’ అని సిద్ధార్థుడితో అన్నాడు. దానికి సిద్ధార్థుడు ‘భిక్షాటన మీ రాజ వంశ ఆచారం కాదు. అది బుద్ధ వంశ ఆచారం. ఇంతకుముందు వేలకొద్దీ బుద్ధులు భిక్షాటన చేశారు’ అని తెలిపాడు.

దీనితో శుద్దోదకుడు మరలా బౌద్ధ సంఘాన్ని భోజనం కోసం రాజభవనానికి ఆహ్వానించాడు. భోజనం పూర్తయిన తరువాత జరిగిన చర్చలో శుద్దోధకుడు బౌద్ధ సంఘంలో చేరి శోతపన్నుగా మారాడు. శుద్దోదకుడితో పాటు అతని మిగిలిన కుమారులు ఆనందుడు, అనిరుద్ధుడు, నందుడు రాజ కుటుంబీకులు కూడా బౌద్ధ సంఘంలో చేరారు. ఏడు సంవత్సరాల వయస్సున్న సిద్ధార్థుడి కుమారుడు రాహులుడు కూడా బౌద్ధ సంఘంలో చేరాడు. బుద్ధుడి శిష్యులలో సరిపుత్త, మహా మొగ్గల్లన, మహా కశ్యప, ఆనంద, అనిరుద్ధ ఐదుగురు ముఖ్యులు. వీరితో పాటు ఉపాలి, సుభోతి, రాహుల, మహా కక్కన సంగీత విద్వాంసులు కూడా బౌద్ధ సంఘంలో చేరారు. దేవదత్తుడు అనే బుద్దుడికి వరుసకు సోదరుడైన మొదటి బౌద్ధ భిక్షువుగా మారినా, బుద్ధుడి శత్రువుగా మారి చంపాలని ప్రయత్నించాడు.

బౌద్ధ గ్రంథాల ప్రకారం బుద్ధుడు మొదట స్త్రీలను సన్యాసినిలుగా తీసుకోవడానికి నిరాకరించాడు. బుద్ధుడి పినతల్లి మహా ప్రజాపతి, బుద్ధుడిని బౌద్ధసన్యాస దీక్షను ప్రసాదించమని వేడుకుంది. కానీ బుద్ధుడు నిరాకరించి కపిలవస్తును వీడి రాజగుహకు ప్రయాణమయ్యాడు. పట్టువదలని మహాప్రజాపతి నిరాశ చెందకుండా కొందరు శాక్య, కొళియ వంశాలకు చెందిన స్త్రీలతో ఒక చిన్న గుంపుగా బుయలుదేరి, బౌద్ధ భిక్షవులను అనుసరిస్తూ రాజాగుహకు చేరుకొని ఐదు సంవత్సరాల తరువాత ఆనందుడి మధ్యవర్తిత్వంతో స్తీలకు కూడా జ్ఞాన సముపార్జనకు సమాన శక్తి ఉందని బుద్ధుడు గ్రహించి, వారికి కూడా బౌద్ధ సంఘంలో స్థానం కల్పించాడు. కానీ బుద్ధుడు సంఘానికి ఉన్న నియమాలతో పాటు, వినయమనే కొత్త నియమాన్ని స్త్రీలకు ప్రత్యేకంగా జతపరిచాడు. దీనితో సిద్ధార్థుడి భార్య యశోధరా కూడా బౌద్ధ సన్యాసిగా మారింది.

మహా పరనిభాన సూక్తం ప్రకారం, బుద్ధుడు తన 80వ యేట తాను కొద్ది రోజులలో నిర్యాణం పొందుతానని ప్రకటించాడు. తరువాత బుద్ధుడు కుంద అనే కుమ్మరి సమర్పించిన ఆహారాన్ని తిన్నాడు. అది తిన్న తరువాత బుద్ధుడు చాలా అస్వస్థతకు గురయ్యాడు. ఈ సమయంలో బుద్ధుడు తన ముఖ్య అనుచరుడు అయిన ఆనందుడిని పిలిచి, తన అస్వస్థతకు కుందు ఇచ్చిన ఆహారం కాదు తనకు ఆఖరి భోజనాన్ని సమర్పించిన కుందు చాలా గొప్పవాడని చెప్పాడు. ఇలా వేలాది నుంచి లక్షలాది మంది శిష్యులుగా చేరి భారతావనితోపాటు పలు ఇతర దేశాలలో బుద్ధడు చెప్పిన సిద్ధాంతాన్ని వ్యాప్తిచేశారు.
బుద్ధం శరణం గచ్ఛామి !

– శ్రీ

Read more RELATED
Recommended to you

Exit mobile version