తెలంగాణ కాంగ్రెస్‌లో అందరూ సీనియర్లే. ఇదంతా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే. పార్టీ కష్టకాలంలో ఉంటే వీరంతా సైలెన్స్ మోడ్ లోకి వెళ్తున్నారు. సీనియారిటీని పక్కన పెట్టి జూనియర్ నాయకుల్లా మారిపోతున్నారు.చెప్పుకోవడానికి కాంగ్రెస్‌లో చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నారు. కానీ వారి నోళ్లు పెగలడం లేదన్న విమర్శ సొంత పార్టీలోనే ఉంది. అధికారంలో ఉన్నప్పుడు సీనియారిటీ విషయంలో పోటీపడే నాయకులు.. ఎందుకు సైలెంట్ అయిపోయారు. పీసీసీ చీఫ్ ఎంపిక విషయంలోనూ వీరి మౌనం పలు సందేహాలకు తావిస్తుంది.
తెలంగాణలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలే కాకుండా.. ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలన్నది బీజేపీ వ్యూహం. ఇందుకోసం వేగంగా పావులు కదుపుతున్నా.. కాంగ్రెస్‌లో చలనం లేదన్న విమర్శ ఉంది. అధికారంలో ఉంటే పదవుల పంపకంలో కనిపించే సీనియారిటీ పంచాయితీ.. పవర్‌లో లేనప్పుడు జెండా భుజాన వేసుకుని ముందుకు నడిపేందుకు మాత్రం ఇబ్బంది పడుతున్నారట. చివరకు గాంధీభవన్‌లో జరిగే సమావేశాలకు, సమీక్షలకు, కోర్ కమిటీ మీటింగ్‌లకు కూడా వీరి దర్శనం లభించటం లేదట. దీని పై ఎవరైన ప్రశ్నిస్తే సీనియర్ నాయకుల అభిప్రాయాలు కానీ.. సలహాలు సూచనలు కానీ పార్టీని నడిపించేందుకు ఏ మేరకు పనిచేస్తున్నాయి? అని ప్రశ్నిస్తున్నారట.
సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి సైలెన్స్ ఎవరికీ అర్ధం కావడం లేదు. పార్టీ మీటింగ్స్‌కు వస్తున్నా.. ప్రధాన అంశాలపై జానారెడ్డి లాంటి వాళ్లు మాట్లాడితే.. జనాల్లోకి వెళ్తుందని.. అధికారపక్షానికి సూటిగా తగులుతాయని కేడర్ భావిస్తోందట. నాగర్జున సాగర్ ఉప ఎన్నిక వేళ పార్టీ బలోపేతానికి జానారెడ్డి లాంటి వారు లీడ్ తీసుకోవాలని కోరుతున్నారట. అయితే తొందరపడి గోదాలోకి దిగడం ఎందుకనే ఆలోచనలో ఉన్నారట పెద్దలు జానారెడ్డి.
తెలంగాణ కాంగ్రెస్‌లో అన్ని అంశాలపై అవగాహన ఉన్న మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచీ యాక్టివ్‌గా లేరు. పలు సందర్భాలలో ఏఐసీసీ,పీసీసీ ఆలోచనలను తప్పుపడుతుంటారు. పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలో తన దగ్గర ప్లానింగ్ ఉన్నా… అడిగేవారు ఏరి.. అన్న లాజిక్‌లో ఉంటారు దామోదర. మాజీ మంత్రి గీతారెడ్డి, రేణుకాచౌదరి ఇద్దరూ సీనియర్ మహిళా నాయకులు. అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించారు. పీవీ శతజయంతి వేడుకల సమయంలో యాక్టివ్ అయినట్లు కనిపించినా..జనంలోకి వెళ్లడం లేదనే విమర్శ గీతారెడ్డిపై ఉంది. రాష్ట్రంలో అనేక సమస్యలున్నా ఫైర్‌బ్రాండ్ లాంటి రేణుకాచౌదరి సైలెంట్ అయితే ఎలా అని ప్రశ్నిస్తున్నారట.
నిజమాబాద్ జిల్లాలో కాంగ్రెస్ ఉందా అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి పార్టీ శ్రేణులు. ఈ జిల్లా నుంచి గతంలో మంత్రిగా పనిచేసిన సుదర్శన్‌రెడ్డి ఏమయ్యారు అని ఆరా తీసే పరిస్థితి ఉంది. మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ ఈ మీడియాలో కామెంట్స్ తో కాస్త హడావిడి చేస్తున్నారు. వరంగల్ జిల్లాలో కాంగ్రెస్‌కు ఫేస్ లేకుండా పోయిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. నియోజకవర్గంలో సమస్యలుంటే తప్ప మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య వెళ్లడం లేదట. రాష్ట్రస్థాయిలో వచ్చే సమస్యలపై వాయిస్ వినిపిస్తారు. కానీ పీసీసీపై అలకతో ఉన్నారాయన.
ప్రస్తుతం ఒకప్పటిలా రాజకీయాలు జరగడం లేదు. నిత్యం జనాల్లో ఉండేవారినే గుర్తించుకుంటున్నారు. పైగా బలమైన కేసీఆర్‌ను, టీఆర్‌ఎస్,బీజేపీని ఎదుర్కోవాలంటే ఈ వైఖరి సరికాదన్నది పార్టీ నేతల్లో వినిపిస్తున్నమాట..మరి.. సీనియర్లు రూటు మార్చుకుంటారో.. కాంగ్రెస్‌లో అంతే అనే నానుడి నిజం చేస్తారో చూడాలి.