అగ్రరాజ్యం అమెరికా లో మరోసారి తూటా పేలింది. అమెరికాలోని మిల్వాకీ నగరంలో విస్కాన్సిన్ ప్రాంతంలోని ఒక బీరు తయారీ యూనిట్ లో ఈ దారుణ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తుంది. ఈ ఘటనలో దుండగుడి తో పాటు మొత్తం ఆరుగురు మృతిచెందినట్లు సమాచారం. మిల్వాకీ నగరంలోని మెల్సన్ కూర్స్ బీర్ కంపెనీ లోకి బుధవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో చొరబడిన దుండగుడు విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడ్డాడు. ఈ కాల్పుల్లో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా,కొంతమంది గాయపడినట్లు సమాచారం. అయితే కాల్పులు జరిపిన 51 ఏళ్ల దుండగుడు కూడా అనంతరం తనను తాను కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడడం తో అతడు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తుంది. అయితే దాడికి పాల్పడిన వ్యక్తి గతంలో అదే కంపెనీ లో పనిచేసే వాడని కొద్దీ కాలం క్రితం అతడిని విధుల నుంచి యాజమాన్యం బహిష్కరించినట్లు సమాచారం. అయితే విధుల నుంచి బహిష్కరణకు గురైన అతడు ఆ సంస్థలో పనిచేసే మరో ఉద్యోగి గుర్తింపు కార్డు దొంగిలించి మరీ కంపెనీ లోకి ప్రవేశించినట్లు అధికారులు చెబుతున్నారు.
అయితే కావాలనే సంస్థల్లోకి చొరబడి కాల్పులు జరిపాడని,ఉద్యోగం నుంచి తప్పించారు అన్న కక్షతోనే అతడు ఈ దారుణానికి పాల్పడినట్లు అధికారులు భావిస్తున్నారు. అయితే సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని అక్కడ పరిస్థితిని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న అధికారులు కాల్పులకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనలో గాయపడిన క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నట్లు సమాచారం.