వైసీపీ ఫైర్‌బ్రాండ్ నాయకురాలు, చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే, జబర్దస్త్ రోజా .. ఎప్పుడూ దూకుడుగానే ఉంటారు. ఆమె ఏం మాట్లాడినా.. రాజకీయంగా సంచలనమే. ఆమె ఏం చేసినా.. సోషల్ మీడియాకు పనేపని! ఇప్పుడు కరోనా నేపథ్యంలోనూ రోజా పనులు, ఆమె వ్యాఖ్యలు అంతే సంచలనం సృష్టిస్తున్నాయి. ఆమె చేస్తున్న పనులకు సోషల్ మీడియా భారీ కవరేజ్ ఇస్తోంది. అదేవిధంగా ఆమె చేస్తున్నవ్యాఖ్యలు కూడా అదే రేంజ్‌లో వైరల్ అవుతున్నాయి. విషయంలోకివెళ్తే.. ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్‌తో రాష్ట్రం మొత్తం లాక్‌డౌన్ అయింది. అయితే, పేదలకు నిత్యావసరాలను ఇచ్చేందుకు ప్రభుత్వం ఈ నెల 29న రేషన్ దుకాణాలను తెరిచి పంపిణీ చేస్తోంది.
ఈ క్రమంలో నగరిలోనూ రేషన్ దుకాణాలను తెరిచి పేదలకు నిత్యావసరాలను పంపిణీ చేస్తున్నారు. ఈ క్రమంలో నగరిలో జరుగుతున్న రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే రోజా సందర్శించారు. తనదైన శైలిలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అదే సమయంలో కొన్ని జాగ్రత్తలు కూడా చెప్పారు. ప్రస్తుతం ఇవి వైరల్ అవుతున్నాయి. కరోనా వ్యాప్తి చెందకుండా చేయడమే కాకుండా పేదలకు నిత్యవసర వస్తువులను అందించడం గొప్ప విషయం అన్నారు. దీంట్లో పోలీసులు చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నారని ప్రశంసించారు. రాత్రింబవళ్లు పని చేస్తున్న పోలీసులకు అందరూ అండగా నిలవాలని కోరారు.
పోలీసులు విసిగిపోతే కరోనా అందరికి వ్యాప్తి చెందే అవకాశం ఉందన్నారు. కరోనా కట్టడికి సీఎం జగన్ తీవ్రంగా కృషి చేస్తున్నారు కాబట్టే దేశంలోనే ఏపీలో తక్కువ కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. కరోనాను పారదోలడంతో అందరు ఐకమత్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఇక, తనే స్వయంగా రేషన్ తీసుకునేందుకు వచ్చిన మహిళలకు రేషన్ సరుకులు తూచి అందించారు. ప్రతి పేద కుటుంబానికి ఏప్రిల్ నాలుగో తేదిన రూ.1000 ఇవ్వబోతున్నామని తెలిపారు. సీఎం జగన్‌కు ప్రజలపై ఉన్న ప్రేమాభిమానాలు, చిత్తశుద్దిని ఈ నిర్ణయాలు తెలియజేస్తాయన్నారు. ఇంట్లో ఉండండి అని చెప్పడమే కాదు ఇంట్లో ఉన్నవారికి అన్ని అందుబాటులోకి తీసుకు రావాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
మొదటి విడత రేషన్‌ను అందించామన్నారు. ఏప్రిల్ 15న రెండో విడత, ఏప్రిల్ 29న మూడో విడత రేషన్‌ను అందిస్తామన్నారు. ప్రతి వ్యక్తికి ఐదు కిలోల బియ్యం, ప్రతి కార్డుకు కేజీ కందిపప్పు చొప్పున ఉచితంగా ఇస్తున్నామని చెప్పారు. మొత్తానికి ఎప్పుడూ రాజకీయాలు మాట్లాడే రోజా నోటి నుంచి ఎలాంటి రాజకీయాలు లేకపోవడంపై సోషల్ మీడియాలో రిలాక్స్‌గా కామెంట్లు పడుతుండడం గమనార్హం. ఏదేమైనా సమయానికి తగిన విధంగా రోజా స్పందించారని అంటున్నారు.