ఈ పరిస్థితుల్లో సోషల్‌ మీడియా అసలు అవసరమా..?

-

ఓ పక్క కరోనా మహమ్మారి ప్రపంచ ప్రజలను గజగజా వణికిస్తుంటే, మరో మహమ్మారి ఆ భయాన్ని పదింతలు చేస్తోంది. అదే ‘‘సోషల్‌ మీడియా’’

‘‘నిజం గడప దాటేలోపు అబద్ధం ఊరు దాటుతుంది’’

వందలాది సంవత్సరాల క్రితం పుట్టిన ఈ సామెత ఇప్పుడు కూడా వాడటానికి అనువైన పరిస్థితులు లోకంలో ఉన్నాయి.

చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి జనాలను వేలాదిగా బలి తీసుకుంటోంది. ప్రభుత్వాలు అన్ని పనులూ పక్కనబెట్టి, దీని బారినుండి ప్రజలను ఎలా కాపాడాలని మల్లగుల్లాలు పడుతున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న కరోనా పాజిటివ్‌ కేసులు దేశాలను ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. ఎప్పుడు ఎక్కన్నుంచి ఏ వార్త వస్తోందోనని గడగడలాడిపోతున్నాయి. ఇదిలా ఉంటే, ఫేస్‌బుక్‌, ట్విటర్‌, వాట్సప్‌ లాంటి సోషల్‌ మీడియంలలో అబద్దపు రాతలు, విషపు కూతలు విచ్చలవిడిగా వీరవిహారం చేస్తున్నాయి. దాంతో ప్రజలు ఇంకా బెంబెలెత్తిపోతున్నారు.

ఏమాత్రం బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్న కొందరు విద్రోహుల మూలంగా నకిలీ వార్తలు ప్రపంచం నలుమూలలకు విస్తరిస్తున్నాయి. ఇప్పటికే కనబడిన ప్రతీవాడినీ అనుమానంగా చూస్తున్న ప్రజలు దీంతో మరింత ఆందోళనకు గురయ్యి, క్రమంగా మానసిక ప్రశాంతతకు దూరమవుతున్నారు.ఈ విపరీత

పరిణామాలను గుర్తించిన ప్రభుత్వాలు, కొన్ని మీడియా సంస్థలు నిజ నిర్ధారణ కోసం ‘ఫ్యాక్ట్‌ చెక్‌’ వ్యవస్థలను నెలకొల్పాల్సివచ్చింది. ఏదైనా అనుమానాస్పద పోస్టు, సోషల్‌ మీడియాలో కనిపించగానే,దానిని ఈ ఫ్యాక్ట్‌ చెక్‌ వెబ్‌సైట్‌కు పంపగానే, వాళ్లు దానిని పరిశీలిస్తారు. అది ముందుగా ఎక్కడ పుట్టింది? దాని నేపథ్యం ఏంటి? ఎలా ఫార్వర్డ్‌ అయింది? లాంటి విషయాలను విశ్లేషించి, అది నిజమా, అబద్ధమా అనేది తేలుస్తారు. ప్రభుత్వపరంగా, తెలంగాణ స్వంత ఫ్యాక్ట్‌ చెక్‌ వ్యవస్థను ప్రవేశపెట్టి, విశేషంగా ఈ ఫేక్‌ న్యూస్‌ను కట్టడి చేయగలుగుతున్నారు. అయితే, విషాదమేమిటంటే, వారు నిజ నిర్ధారణ చేసే లోపే, ఆ తప్పుడు వార్త వేలాదిమందికి చేరిపోతోంది.

నిజానికి ఈ సోషల్‌ మీడియా అనేది అవసరమా? అనే మీమాంస ఎప్పటినుంచో ఉన్నది. అవసరం అనుకుంటే… ఎవరికి? ఇప్పటిదాకా ప్రపంచంలో సోషల్‌ మీడియా వల్ల ఒకగూరిన లాభాలేంటి? అంటే ఇదమిద్దంగా ఎవరూ ఏమీ చెప్పలేని స్థితి. ప్రధానంగా రాజకీయ పార్టీలు, నాయకులు వీటిని బాగా వెనకేసుకొస్తున్నారు. కారణం, తక్కువ ఖర్చుతో ఎక్కువమందికి తాము చెప్పాలనుకున్నది చేరుతుందనే భ్రమ. ప్రభుత్వాలకు తాము చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు తెలియజేయడం తేలిక అవుతోందనే ఆశ. ఇవన్నీ వృధా ఆర్బాటాలే తప్ప పనికి వచ్చేవి కావు.

నూటికి తొంభై మంది సోషల్‌ మీడియా వినియోగదారులకు ఏమీ తెలియదు. షావొమీ, వివో, ఒప్పో, జియోల పుణ్యమా అని ప్రతీవాడికీ ఓ అకౌంట్ ఉంది. వాళ్ల అడ్డమైన ఫోటోలు వాటిల్లో పోస్ట్‌ చేయడం, ఎన్ని లైకులొచ్చాయో చూసుకోవడం తప్ప మరోటి తెలియదు. రకరకాల వ్యక్తులందరూ ఇందులోనే ఉంటారు. వీరినే పార్టీలు ప్రభావశీల బృందాలుగా పరిగణిస్తున్నాయి.నిజానికి ఓ పదిశాతం మందే దీన్ని సక్రమంగా, బాధ్యతాయుతంగా వాడుతున్నారు.

కాకపోతే, సోషల్‌ మీడియా వల్ల ప్రతీ వ్యక్తి నోరు బాగా లేస్తోంది. విచ్చలవిడి స్వేచ్ఛ లభించింది. ఏదైనా అనగలిగేస్వాతంత్య్రం వచ్చింది. మంచి, చెడు, ఉచ్చం, నీచం, ఆడా, మగా  అనే తేడాలు లేకుండా ఎలా పడితే అలా రెచ్చిపోతున్నారు. ఒక చెడు వ్యాఖ్య ఎంతమందికి బాధ కలిగిస్తుందోననే విషయాన్ని వారు పట్టించుకోవడం లేదు. ఎంతసేపూ తన తనివి తీరిందా? లేదా అనేదే ముఖ్యం. ఈ సోషల్‌ మీడియా వల్ల పనివేళలు దెబ్బతింటున్నాయని, రకరకాల మానసిక వ్యాధులు పరిణమిస్తున్నాయని ఒక పక్క డాక్టర్లు, నిపుణులు హెచ్చరిస్తున్నా, ఎవరికీ చెవికెక్కడంలేదు. కుటుంబంలో ఉండే నలుగురూ ఎదురెదురుగా ఉండి కూడా వాట్సప్‌లో ‘‘మాట్లాడుకుంటున్నారు’’.

ముఖ్యంగా తమనుతాము సెలబ్రిటీలుగా ఊహించుకునే సినీతారలు, కనీసం ఇంగితజ్ఞానం లేకుండా ప్రవర్తిస్తుంటారు. వారివారి జీవనశైలితో ప్రజలకేం సంబంధం? కరోనా లాక్‌డౌన్‌ మూలాన, తాను వంట చేస్తున్నానని ఒకడు పెంట చేస్తే, ఫిట్‌నెస్‌ పెంచుకోవడానికి తాను సెక్సర్‌సైజులు చేస్తున్నానని ఓ విదుషీమణి విడియో.. నాలుగో భార్యతో విడాకులు తీసుకున్నానని ఒకడు, పన్నెండోసారికి కొడుకు పుట్టాడని ఒకడు, తన కొడుకు వయసున్న హీరోతో తిరుగుతూ, అడ్డమైన ఫోటోలు పెట్టే ఓ వృద్ధనటీమణి… అరకొర దుస్తులతో తమ బాడీలను మార్కెట్ చేసుకునే సతీ యాంకర్లు, హీరోయిన్లు, పచ్చి బూతులతో రెచ్చిపోయే ఓ శ్రీనటి… ఏంటీ దరిద్రం? ఎందుకు?

దేశదేశాలు కరోనా మహమ్మారిని ఎదుర్కోలేక సతమతమవుతున్న ఈ తరుణంలో, ఈ సోషల్‌ మీడియా చేస్తున్న దురాగతాలకు అంతే లేదు. అసలు దీన్ని నిషేధిస్తే తప్పేంటి? జనాలు బతకలేరా? ఏం.. ఇప్పుడు తాగడానికి మందు లేక బతకట్లేదా? సిగరెట్లు దొరక్కపోతే బతకట్లేదా? ఆర్టికల్‌ 370 రద్దు చేసిన నాటినుండి నేటి వరకు జమ్ము-కాశ్మీర్‌లలో అసలు ఇంటర్‌నెట్టే లేదు. కాశ్మీరీలందరూ చచ్చిపోయారా?లేదే..

ఏమీ కాదు… ప్రళయమేమీ రాదు. భూగోళం మండిపోదు. మనుషులు మనుషులతో మాట్లాడుతుంటారు. శుభకార్యమైనా, దుర్వార్తయినా వ్యక్తిగతంగా హాజరై తమ సంతోషాన్నో, బాధనో వ్యక్తపరుస్తారు. మానసికంగా ఉల్లాసంగా మారుతారు. ఒత్తిడి, కుంగుబాటు, ఆందోళన దూరమవుతాయి. పిల్లలకు దగ్గరవుతారు. భార్యకు భర్త, భర్తకు భార్య తోడవుతారు.చివరికి మనిషి మనిషిగా మిగులుతాడు. అన్నట్టు… ఇవన్నీ మంచివేగా….

కనీసం కరోనా కాలంలోనైనా నిరోధిస్తే, ప్రజలకు వాస్తవాలు తెలిసే అవకాశం ఉంటుంది. మరింత అప్రమత్తంగా ఉంటారు.

ఈ కరోనా అనబడే వ్యాధి దేశాలలో, సమాజంలో చాలా రకాల మార్పులు తీసుకురాబోతోంది. చాలా విషయాల పట్ల ప్రజలకుండే దృక్కోణాన్ని మార్చబోతోంది. వారి ఆలోచనాధోరణి సరికొత్తగా ఉంటుంది. కష్టం, నష్టం, నిరాశానిస్పృహల నుండి ఓ సరికొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టాల్సిఉంటుంది… ప్రేమ, నమ్మకం, మంచితనం, మానవత్వం వైపు…. కులాలు-మతాలు లేని ఓ నవ్వ లోకం వైపు..

– రుద్రప్రతాప్‌

Read more RELATED
Recommended to you

Exit mobile version