ప్రేమకు ఉరి.. సమాజానికి ప్రేమ బలి అవాల్సిందేనా ..?

-

ప్రేమ… రెండు మనసుల మధ్య పుట్టడం అనేది చాలా కష్టం. దీనికి వయసుతో సంబంధం లేదు. అసలు మనిషి మనసుకి వయసుకి సంబంధం లేదు. వయసు 70 ఉన్నా చాలా మంది చిన్న పిల్లల మాదిరిగానే ఆలోచిస్తూ ఉంటారు. ప్రేమ విషయంలో కూడా అంతే. ఎదుటి మనిషి మనసుకి నచ్చితే ఆ మనిషి మీద తమకున్న భావాలను చెప్తూ తమ ప్రేమను వ్యక్తపరుస్తూ ఉంటారు. ఒకరికి ఒకరు నచ్చితే ప్రేమ మొదలవుతుంది.

ప్రేమించుకునే సమయంలో ఒకరికి ఒకరు కలిసి జీవితం అంతా నడవాలని భావిస్తారు. తల్లి తండ్రులు సమాజం అంగీకరించకపోయినా సరే ప్రేమ కోసం ఎంత వరకు అయినా వెళ్తూ ఉంటారు. తల్లి తండ్రులతో పాటు ఉపయోగం లేని సమాజం ని కూడా మెప్పించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాని సమాజం దృష్టిలో చూసే కోణాలను మాత్రం ప్రేమికులు ఒప్పించలేరు. వాళ్ళను వాళ్ళు నొప్పించుకోవడమే గాని చేసేది ఏమీ ఉండదు.

ప్రేమిస్తారు, పెళ్లి చేసుకోవాలనుకుంటారు. అసలు ఈ రోజుల్లో ప్రేమ బతకడమే కష్టంగా ఉంది. అలాంటిది బతికిన ప్రేమను నిలుపుకోవడం ప్రేమికులకు కష్టం అవుతుంది. ఎంత కష్టపడి పెళ్లి వరకు వచ్చినా… అబ్బాయి నచ్చలేదని, కులం మనది కాదని, వెనుక ఆస్తి పాస్తులు లేవని చెప్తూ ఉంటారు. దీనితో ఇప్పుడు చాలా మంది ఆత్మహత్యే శరణ్యం అనుకునే పరిస్థితి ఏర్పడింది అనేది వాస్తవం.

గత వారం పది రోజుల్లో నాలుగు ప్రేమ జంటలు ఆత్మహత్యా యత్నాలకు పాల్పడ్డాయి. భువనగిరి, నిజామాబాద్ సహా మరో రెండు ప్రాంతాల్లో పెద్దలు పెళ్ళికి ఒప్పుకోవడం లేదని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆదివారం ఒక జంట ఆత్మహత్యకు పాల్పడింది. తల్లి తండ్రులను అర్ధం చేసుకోవడం లో తప్పు లేదు. పెళ్లి చేసుకోవాలని ఆలోచించడం లో కూడా తప్పు లేదు. ప్రేమించడం పాపం కాదు. ప్రేమించిన మనిషి కావాలనుకోవడం శాపం కాదు.

ఇష్టం లేని వాడికి ఇచ్చి పెళ్లి చెయ్యాలి అనుకునే తల్లి తండ్రులు, అమ్మాయికి ఆస్తి ఉంటేనే పెళ్లి కూతురు అవుతుంది అనుకునే తల్లి తండ్రులు, ఎదుటి వాళ్ళు చేసేది తప్పు అనే పత్తిత్తి సమాజం ఉన్నన్ని రోజులు ప్రేమ అనేది ఉరి తాడుకి వేలాడుతుంది. ప్రేమించడం, ప్రేమించబడటం అనేది ఒక వరం. నీ కూతురు మీద కొడుకు మీద ప్రేమ ఉందా…? వాళ్ళు ప్రేమించిన వ్యక్తి గురించి తెలుసుకో. నచ్చితే ఒప్పుకో… నచ్చకపోతే వదిలేయ్.

ప్రేమించిన వాడికి పరిణితి ఉండకపోవచ్చు, ప్రేమించిన వాడు అన్నీ ఆలోచించకపోవచ్చు. సమాజంలో పరువు పోతుంది అని నువ్వు భయపడుతున్నావ్. ప్రేమించిన వ్యక్తి దూరమవుతుందని పిల్లలు భయపడుతున్నారు. అర్ధంతరంగా తనువు చాలించడం కంటే నీకు తల కొరివి పెట్టడానికి అయినా ఉండాలి కదా…? నీ భార్య రేపు ఒంటరి అయితే చూసేది నీ పిల్లలే కదా…? సమాజంలో ఆలోచనలు మారాలి.

పక్కని వాడు చేసే అనవసర విషయాల మీద అనవసర దృష్టి పెట్టడం తగ్గించాలి. నీ బతుకు నువ్వు బతకరా బాబూ పక్కనోడి గురించి నీకెందుకు. ఆడు ప్రేమించాడు ఆ అమ్మాయి పెళ్లి చేసుకోవాలనుకుంది. నీకు నచ్చిందా నవ్వు, నచ్చకపోతే సైలెంట్ గా ఉండు. అంతే పక్కనొడు తప్పు చేసాడనే ప్రచారం నీకెందుకు. తల్లి తండ్రులు కూడా ఒకటి ఆలోచించాలి. నీ జీవితంలో ఏ విధంగా ఉపయోగపడని సమాజం గురించి పిల్లలను వేధించడ౦ అనే దరిద్రపు ఆలోచన నుంచి బయటకు రావాలి. ప్రేమను చంపి మనిషిని చంపడం మంచిదా…? మనిషిని వదిలేసి బతికించడం మంచిదా…?

Read more RELATED
Recommended to you

Exit mobile version