కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో అత్తాపూర్ డివిజన్ కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..కాంగ్రెస్ ఇచ్చిన మోసపూరిత హామీలకు తెలంగాణ ప్రజలు టెంప్ట్ అయి ఆ పార్టీకి అవకాశం ఇచ్చారని.. ఫలితంగా తినే అన్నంలో మట్టిపోసుకున్నారని విమర్శించారు.
కాంగ్రెస్,బీజేపీ పార్టీలు ఎన్ని కథలు చెప్పినా ఔటర్ లోపలి ప్రజలు వారి మాటలను నమ్మలేదన్నారు.అధికారం ఎవరికీ శాశ్వతం కాదని మంచి చేస్తే ఎవరైనా అభినందిస్తారని.. గతంలో వైఎస్సార్, చంద్రబాబు నాయుడు చేసిన మంచి పనులను, వారిని గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో వారు చేసిన మంచి పనులను కేసీఆర్ కొనసాగించారని.. కానీ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు.వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. 500 రోజులు పూర్తయినా ఒక్క పథకం కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోయిందన్నారు.