అర్ధరాత్రి దాటినా నిద్రరాకపోతే.. ఇలా చేయండి..!

-

కొందరికి అర్ధరాత్రి దాటినా నిద్రరాదు. ఎందుకంటే వాళ్లు రాత్రిదాకా ఫోన్, టీవీలు చూస్తూ కాలం గడిపేస్తుంటారు. అది అలవాటై పడుకుందామనుకున్న సమయంలోనూ నిద్రరాదు. మరికొందరికి రాత్రి కాగానే ఏవేవో ఆలోచనలు వారిని చుట్టుముట్టేస్తుంటాయి. ఆ ఆలోచన చిక్కుల్లో చిక్కుకుని వాళ్లకి నిద్రదూరం అవుతుంది. ఇది కేవలం యువత, మధ్యవయస్కుల్లో ఉండే సమస్య మాత్రమే కాదు. వృద్ధుల్లోనూ ఈ సమస్యతో బాధ పడే వారు చాలా మంది ఉన్నారు. చెప్పాలంటే వృద్ధుల్లోనే ఎక్కువ ఉన్నారు.

వృద్ధులకు రాత్రికాగానే ఒంటరితనం వేధిస్తుంది. ఇది అవసరపు ఆలోచనలు మెదడులోకి తీసుకొస్తుంది. వారు తమ లైఫ్ లో చేయలేకపోయినవి.. చేయకూడనివి చేసుంటే వాటి గురించిన ఆలోచనలు.. వారు చేసిన తప్పులు, చేయలేకపోయిన పనులు, చేయాలనుకున్న పనులు ఇలా అన్నిరకాల ఆలోచనలు వారిని చుట్టుముట్టేసి నిద్రకు దూరం చేస్తాయి. చాలా మంది వృద్ధులు వారి జీవిత భాగస్వామిని కోల్పోయి ఒంటరితనకు గురవుతారు. భాగస్వామి గురించిన ఆలోచనలు వీరిని నిద్రపోనివ్వవు. పిల్లల గురించిన ఆవేదన.. పిల్లలు వారికి దూరంగా ఉంటే ఎలా ఉన్నారు.. తిన్నారో లేదోనని బెంగ.. కొందరు పిల్లలు తల్లిదండ్రులను పట్టించుకోరు. అలాంటి తల్లిదండ్రుల పరిస్థితి మరింత దయనీయం.

ఇలాంటి ఆలోచనలతో నిద్రకు దూరమవుతుంటే పరిస్థితులు చేయిదాటకముందే గ్రహించండి. గతాన్ని తలుచుకుని బాధపడటం వల్ల ఏం ఒరగదు. రాబోయే భవిష్యత్ గురించి ఆలోచించి భయపడటం వల్ల జరిగేది జరగక మానదు. ఈ ఆలోచనలన్ని దూరం కావాలంటే రోజు కాసేపు ధ్యానం చేయండి. సాయంత్రం పూట మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో కాసేపు ముచ్చటించండి. దీనివల్ల మనసుకు ఉల్లాసం కలిగి నిద్రపడుతుంది.

మరోవైపు కొందరి వృద్ధులను రాత్రిపూట ఆరోగ్య సమస్యలు కూడా బాధిస్తాయి. బి విటమిన్లు తగ్గితే కాళ్లు చేతులు లాగుతాయి. ఐరన్ తగ్గితే రక్తహీనత తలెత్తుతోంది.వీటివల్ల కూడా నిద్రపట్టదు. రాత్రిపూట పిక్కలు పట్టేస్తున్నట్టయితే క్యాల్షియం మాత్రలూ అవసరమవుతాయి. మీకు మధుమేహం, అధిక రక్తపోటు, ప్రోస్టేట్‌ ఉబ్బు వంటి సమస్యలేవైనా ఉన్నాయా? వీటికేమైనా మందులు వాడుతున్నారా? అనేదీ ముఖ్యమే. ఎందుకంటే మధుమేహం, ప్రోస్టేట్‌ గ్రంథి ఉబ్బులో తరచూ మూత్రం వస్తుంటుంది. ఇది నిద్రకు భంగం కలిగించొచ్చు. కొన్నిసార్లు మందుల మోతాదులను తగ్గించటం లేదా మందులను మార్చటం ద్వారా ఫలితం ఉండొచ్చు.

మీరు రోజంతా ఏమేం పనులు చేస్తున్నారన్నదీ ఒకసారి గమనించుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా ఒక వయసు వచ్చాక చేయటానికి పెద్దగా పనులేమీ ఉండవు. దీంతో పొద్దున్నో, మధ్యాహ్నమో కాస్త నడుం వాలుస్తుంటారు. మధ్యాహ్నం నిద్ర పోతే రాత్రిపూట సరిగా నిద్ర రాదు. ఇలాంటి కారణాలేవైనా గమనిస్తే సరి చేసుకోవాలి.

వీలైతే రోజూ కాసేపు నడవటం మంచిది. దీంతో శరీరం, మనసు హుషారుగా ఉంటాయి. సాయంత్రం గోరువెచ్చటి నీటితో స్నానం చేయటం, పడకగదిలో వెలుగు మరీ ఎక్కువగా లేకుండా చూసుకోవటం, శ్రావ్యమైన సంగీతం వినటం, కాసేపు పుస్తకం చదువుకోవటం, పడుకునే ముందు గ్లాసు పాలు తాగటం వంటివి ఆచరిస్తే నిద్ర బాగా పట్టటానికి అవకాశముంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version