చెప్పిన మాట వినకపోవడమనేది.. నిజానికి చాలా మంది భారతీయుల్లో ఎప్పటి నుంచో ఉన్నదే.. అరే బాబూ.. తలకు హెల్మెట్ పెట్టుకుని బండి నడుపు.. లేకపోతే యాక్సిడెంట్ అయితే చస్తావ్.. అని చెప్పినా కొందరు వినరు. తాగి వాహనం నడపకు.. పోతావ్.. అని చెబితే.. ఉహూ.. నేనలాగే చేస్తా.. అని మూర్ఖంగా వ్యవహరించేవారు కొందరు ఉంటారు.. ఇక ప్రస్తుతం.. చాలా మంది.. ఇండ్ల నుంచి బయటకు రాకండి.. అని చెప్పినా వినడం లేదు.. ఇంకా మొండిగానే వ్యవహరిస్తున్నారు. ఓవైపు కరోనా దెబ్బకు ప్రపంచం విలవిల్లాడిపోతుంటే.. కొందరు మాత్రం బాధ్యతారాహిత్యంగా ప్రవరిస్తున్నారు. తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఇలాంటి వారి ప్రవర్తన వల్ల ఇతరుల ఆరోగ్యానికీ ముప్పు ఏర్పడుతోంది.
లాక్‌డౌన్‌తో దేశమంతటా బంద్ అయింది. అన్నీ మూతపడ్డాయి. అయినప్పటికీ కొందరు మాత్రం బయటకు వచ్చి ఏం చేయాలనుకుంటున్నారో తెలియదు కానీ.. లాక్‌డౌన్ నిబంధనలను పూర్తిగా ఉల్లంఘిస్తున్నారు. అమెరికా వంటి అగ్రదేశాలే కరోనా దెబ్బకు ఆగమాగం అవుతున్నాయి. అయినా మన దేశంలో కొందరికి మాత్రం ఇంకా చీమకుట్టినట్లు కూడా లేదు. అలాంటి వారు బయటకు వచ్చి తిరుగుతున్నప్పుడు.. పోలీసులు వారిని ఆపితే.. వారు చెబుతున్న సిల్లీ మాటలు విని ఇతర జనాలకు చిర్రెత్తుకొస్తోంది.
దేశంలో లాక్‌డౌన్ కారణంగా ఇప్పటికీ ఇంకా అనేక మంది పేదలు, కార్మికులు, కూలీలకు పూటకు తిండి కూడా దొరకడం లేదు. అయినా కొందరు మాత్రం తాము నిత్యం తింటున్న ఆహారం కాదని.. పంచభక్ష్య పరమాన్నాల కోసం పాకుతుండడం నిజంగా.. ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇలాంటి వారా మన దేశంలో ఉన్నది.. అని ఒకింత బాధ కూడా కలుగుతుంది. లాక్‌డౌన్ సమయంలో ఇండ్లలోనే ఉంది.. దొరికింది తిని.. గప్‌చుప్‌గా ఉండకుండా.. జిహ్వా చాపల్యం తీర్చుకోవడం కోసం.. మద్యం తాగడం కోసం.. ఇతర విలాసాల కోసం కొందరు బయటకు వస్తుండడాన్ని చూస్తే.. నిజంగా వారికి బాధ్యత లేదా..? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
కరోనా మహమ్మారి అనేది ఇప్పుడు సామాజిక సమస్య.. కేవలం ఒక్క వ్యక్తికే పరిమితమైంది కాదు. డ్రైవింగ్ చేసేటప్పుడు హెల్మెట్ పెట్టుకోకపోతే.. నువ్వు చస్తే.. అది నీ సమస్య.. దాంతో సమాజానికి ఏం కాదు. అలాగే తాగి బండి నడిపితే.. యాక్సిడెంట్ అయి చనిపోతే.. దాంతో నీ కుటుంబం బజారున పడుతుంది. అది నీ కుటుంబ సమస్య.. కానీ లాక్‌డౌన్ ఉన్న ఈ సమయంలో నువ్వు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే.. కరోనా మహమ్మారి అందరికీ వ్యాప్తి చెందుతుంది. ఇదిప్పుడు అందరి సమస్య.. సామాజిక సమస్య.. కనుక ఈ సమస్య నుంచి అందరినీ రక్షించాలంటే.. నువ్వు బాధ్యతగా వ్యవహరించాలి. కొన్ని రోజుల పాటు అన్ని సుఖాలకు, విలాసాలకు చెక్ పెట్టి.. లాక్‌డౌన్‌ను సంపూర్ణంగా పాటించాలి. దాంతో కరోనా మహమ్మారి అనే సామాజిక సమస్య పోతుంది.. ఇకనైనా కొందరు జనాలు బాధ్యతా రాహిత్యాన్ని వదిలి బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తే మంచిది.. అది వారికి, వారి కుటుంబానికే కాదు.. సమాజానికీ ఎంతో మేలు చేస్తుంది..!