జగన్ కు దమ్ముంటే, నిజాయితీ వుంటే సివిల్ సప్లై ఛైర్మెన్ భాస్కర్ రెడ్డిని తొలగించాలని డిమాండ్ చేశారు సోము వీర్రాజు. కేంద్రం అందిస్తున్న ఉచిత బియ్యాన్ని రాష్ట్రం పంపిణీ చేయకపోవటంతో బిజేపి కార్యాలయం వద్ద నిరసనకు కూర్చున్నారు బిజేపి నాయకులు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ… కేంద్రం అందించే ఉచిత బియ్యం రాష్ట్రం అందించట్లేదని.. నాలుగు నెలలుగా బియ్యం ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు.
రాష్ట్ర ప్రభుత్వం దీనిపై సరైన వివరణ ఇవ్వాలి.. ప్రభుత్వం దిగిరకపోతే 18వ తేదీన అన్ని మండలాల్లో నిరసన కార్యక్రమాలు చేపడతామని.. ఇంకా ప్రభుత్వం దిగిరకపోతే ఉద్యమం దిగువ స్థాయికి తీసుకెళ్తామని చెప్పారు. మోదీ ఇస్తున్న బియ్యాన్ని రాష్ట్రం అమ్మేసుకుంటుందని… రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈ విషయంపై సరైన వివరణ ఇవ్వట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం ఇచ్చే నిధులను కూడా రాష్ట్రం వాడేసుకుంటుందని… ప్రజలు వైకాపా నాయకులను బియ్యం ఇవ్వట్లేదు అని అడిగితే మోదీ ఇవ్వట్లేదు అని అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. కేజీ బియ్యానికి రాష్ట్రం ఇచ్చేది 2 రూపాయాలు,కేంద్రం 38.45 పైసలు ఇస్తుందని.. పేదలకు బియ్యం ఇవ్వకుండా బియ్యం అమ్మేసుకునే వాళ్లకు ఇస్తున్నారన్నారు.