రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా దూసుకెళ్తున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో త్వరలో వాట్సాప్ ద్వారా 150 రకాల పౌర సేవలు అందుబాటులోకి రానున్నాయని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ తెలిపారు. ఈ నేపథ్యంలో సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ కేంద్రాన్ని సందర్శించిన అనంతరం ప్రభుత్వంలో వివిధ శాఖలు తమ పని తీరు మెరుగుపరుచుకోవడానికి వీలుగా RTGS సాంకేతిక సహకారాన్ని అందించాలని వెల్లడించారు.
RTGS కార్యకలాపాలను ప్రత్యక్షంగా తానే పర్యవేక్షిస్తానని పేర్కొన్నారు. పౌరులకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు వాట్సాప్ గవర్నెన్స్ ను తీసుకురావాలని నిర్ణయించారని సీఎస్ విజయానంద్ తెలిపారు. వాట్సాప్ గవర్నెన్స్ కు సంబంధించి పనులు ఎంత మేరకు వచ్చాయని ఆయన ఆర్టీజీఎస్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆర్టీజీఎస్ సీఈవో దినేష్ కుమార్ స్పందిస్తూ.. వాట్సాప్ గవర్నెన్స్ కు సంబంధించిన పనులు దాదాపుగా పూర్తి చేశామన్నారు.