పొగతాగే వారికి కేంద్రం షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ధూమపాన ప్రియులకు కేంద్ర ప్రభుత్వం చుక్కలు చూపించనుంది. త్వరలో కొత్త రూల్స్‌ను అమలు చేయనుంది. ఆ రూల్స్‌కు గాను ఇప్పటికే ఓ డ్రాఫ్ట్ ను కూడా ప్రభుత్వం సిద్ధం చేసింది. సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ది సిగరెట్స్ అండ్ అదర్ టొబాకో ప్రొడక్ట్స్ యాక్ట్ కు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మార్పులు చేసి కొత్త డ్రాఫ్ట్‌ను రూపొందించింది. ఈ క్రమంలో ఆ డ్రాఫ్ట్‌కు త్వరలో ఆమోద ముద్ర వేయనున్నారు.
కొత్త రూల్స్ ప్రకారం ఇకపై పొగతాగాలంటే 21 ఏళ్ల వయస్సు నిండి ఉండాలి. అలాగే ఆ వయస్సు నిండిన వారికే సిగరెట్లను విక్రయించాల్సి ఉంటుంది. అంతకన్నా తక్కువ వయస్సు ఉన్నవారికి సిగరెట్లను విక్రయిస్తే అలాంటి వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు. ఇప్పటి వరకు ఈ నిబంధనలను ఉల్లఘించిన వారికి.. అంటే.. 18 ఏళ్ల కన్నా తక్కువ వయస్సు ఉన్నవారికి సిగరెట్లను అమ్మినవారికి 2 ఏళ్ల జైలు శిక్ష, రూ.1వేయి ఫైన్ విధించేవారు. ఇకపై ఆ శిక్షను 7 ఏళ్లకు పెంచనున్నారు. అలాగే ఫైన్‌ను రూ.1 లక్ష చేశారు. అందువల్ల సిగరెట్లను విక్రయించేవారు కూడా ఇకపై ఈ నిబంధనలను దృష్టిలో పెట్టుకుని సిగరెట్లను విక్రయించాల్సి ఉంటుంది.
అలాగే సిగరెట్ ప్యాకెట్లను మాత్రమే ఇకపై అమ్మాలి. లూజ్ సిగరెట్లను విక్రయించడానికి వీల్లేదు. దీంతోపాటు స్మోకింగ్ జోన్ పేరిట ఎయిర్‌పోర్టలు, రెస్టారెంట్లు ఇతర ప్రదేశాల్లో ఉండే ప్రత్యేక జోన్లను కూడా నిషేధించారు. అంటే ఆ జోన్లలోనూ ఇకపై సిగరెట్లను తాగకూడదు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు.