కుంటాల జలపాతం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి..!

-

ఆదిలాబాద్: కుంటాల జలపాతం అభివృద్ధిపై అధికారులు దృష్టి సారించారు. తెలంగాణ రాష్ట్రంలోనే ఎత్తైన ఈ జలపాతాన్ని చూసేందుకు పర్యాటకుల తాకిడి ఎక్కువగానే ఉంటుంది. అయితే పర్యాటకుల ఇబ్బందులు తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. కుంటాల జలపాత అభివృద్ధికి ఆమోదం తెలిపింది. పర్యాటకుల కోసం ఈ ప్రాంతంలో రిసార్టులు, కుటీరాలను నిర్మిస్తున్నారు. త్వరలో టెండర్లను పిలిచి పనులను ప్రారంభించనున్నట్లు సమాచారం.

కుంటాల జలపాతం

కుంటాల జలపాతం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.3.81 కోట్లను మంజూరు చేసింది. ఈ మేరకు అధికారులు డిటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) తయారీలో బిజీ అయ్యారు. కేంద్ర టూరిజం మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో స్వదేశీ దర్శన్ పథకం ద్వారా పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు నిధులు కేటాయిస్తోంది. దీనిలో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఈ పనులను ఐటీడీఏ అమలు చేస్తుండగా.. రాష్ట్ర పర్యాటక శాఖ అనుసంధానంగా పని చేయనుంది.

జూలై నుంచి అక్టోబర్ నెలలో కుంటాల జలపాతం చూసేందుకు పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తుంటారు. కేవలం మన రాష్ట్ర ప్రజలే కాకుండా పొరుగు రాష్ట్రాల వారు కూడా కుంటాల అందాలు వీక్షించేందుకు వస్తుంటారు. అయితే ప్రస్తుతం ఇక్కడ పర్యాటకులకు అనుకూలమైన సౌకర్యాలు సరిగ్గా లేవు. దీంతో ప్రభుత్వం కుంటాల జలపాతం అభివృద్ధిపై నిర్ణయం తీసుకుంది. గిరిజన సంస్కృతిని ప్రతిబింబించేలా ఎకో ఎథెనిక్ రిసార్ట్‌ను నిర్మించబోతోంది. అలాగే పర్యటకులు స్టే చేసేలా పర్యావరణానికి అనువుగా కుటీర నిర్మాణాలు చేపట్టనున్నారు.

ఈ జలపాతం అటవీ ప్రాంతంలో ఉంది. పర్యావరణ ప్రేమికులకు ఈ ప్రాంతంలో విడిది చేయాలనే ఉద్దేశం ఎక్కువగా ఉంటుంది. దీనికి తగ్గట్లుగానే రాష్ట్ర ప్రభుత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. పర్యాటకులకు అనువుగా అన్ని మెరుగైన సౌకర్యాలను కల్పించనుంది. కుంటాల జలపాతం ఆదిలాబాద్ జిల్లాలోని సహ్యాద్రి పర్వత పంక్తుల్లో కడెం నదిపై ఉంది. నేరడిగొండ ప్రాంతానికి 12 కిలోమీటర్ల దూరంలో ఈ జలపాతం ఉంది. 45 మీటర్ల ఎత్తు కొండ నుంచి నీళ్లు జలజల పారుతూ.. పర్యాటకులను ఎంతో ఆకట్టుకుంటోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version