నారదుడు హాజరైన స్వయం వరం మీకు తెలుసా ?

-

నారదుడు.. ముల్లోకవాసి. బ్రహ్మజ్ఞాని, బ్రహ్మచారి. ఆ జన్మ బ్రహ్మచారి, కానీ ఆయన కూడా ఒకసారి వివాహం చేసుకోవాలనుకున్నాడు. ఒక స్వయం వరానికి హాజరైనాడు. ఆ కథావృత్తాంతం తెలుసుకుందాం…

నారద మహర్షి గురించి తెలియన భక్తులు ఉండరు. మహాభక్తుడు. సర్వలోక శ్రేయోభిలాషి ఆయన ఒకసారి శివుని కోసం మానస సరోవరం వద్ద ఘోర తపస్సు చేశాడు. దాన్ని ఆటంక పర్చేందుకు ఇంద్రుడు రంభ, ఊర్వశి, మేనకలను సైతం పంపినా ఆయన చలించకుండా శివుడి తపస్సు ఆచరించి శివానుగ్రహం పొందుతాడు. అయితే ఆయనలో కించిత్‌ గర్వంతో కైలాసానికి వెళ్లి అక్కడ మహాదేవుడితో నేను కామక్రోధాలను జయించాను అనగా నవ్వి ఊరుకుంటాడు. కానీ నీవి విషయం శ్రీహరికి మాత్రం చెప్పకు అంటాడు. కానీ నారదుడు మాత్రం కొంతకాలం తర్వాత వైకుంఠంకు వెళ్లి శ్రీహరితో మానససరోవరం దగ్గర చేసిన తపస్సు, భంగం చేయడానికి వచ్చిన ఇంద్రలోక కన్యలు, వారిని తన మనస్సులోకి రానివ్వలేదన్న విషయం గర్వంగా చెప్తాడు. అంతే శ్రీహరి మాయతో ఆయన మనస్సు మారిపోతుంది. భూలోకంలో కళ్యాణపురం అనే ఒక పట్టణం ఉంది. సస్యశ్యామలమై దేనికీ కొరత లేకుండా ఉన్న ఆ పట్టణంలోని ప్రజలంతా సుఖసంతోషాలతో ఉన్నారు.

ఆ పట్టణ రాజుకు అతిలోక సౌందర్యరాశియైన ఒక కూతురు ఉంది. ఆమె పేరు రమాదేవి. సృష్టిలోని అందాన్నంతా రాశిపోసి, బ్రహ్మ ఆ ఒప్పులకుప్పను సృష్టించాడేమో అనిపించేలా ఉంటుందామె. కొంతకాలానికి ఆ రాజు దగ్గరికి వెళ్తాడు. ఆ రాజు నారదుడిని చూసి అర్ఘ్యపాదులు ఇచ్చి ఆతిథ్యం ఇస్తాడు. అంతలో ఆ రాజుకూతురు అక్కడికి రమాదేవి అక్కడకి వస్తుంది. ఆమె జాతకం చూసిన నారదుడు ఆమెను శ్రీహరి వివాహం చేసుకుంటాడని చెప్తాడు. కానీ ఆమె సౌందర్యానికి వశుడవుతాడు. అంతలోనే ఆ రాజు తన కూతురు స్వయం వరం గురించి తెలుపుతాడు. ‘నీ కూతురి స్వయంవరానికి తప్పకుండా వస్తా”నని మాటిచ్చి రాజును, రమాదేవినీ ఆశీర్వదించి అక్కడి నుంచి సరాసరి వైకుంఠానికి వెళ్ళాడు నారదుడు. కొన్ని రోజుల తర్వాత రమాదేవి స్వయంవరం జరుగుతుంది. అక్కడ.. విశాలమైన ఆ సభామంటపమంతా వివిధ దేశాధీశులతోనూ, రాకుమారులతోనూ నిండి ఉంది. అయితే అక్కడ కూర్చున్న వారి నేత్రాలు మాత్రం అపరంజిబొమ్మను, అందాలరాశిని ఎప్పుడెప్పుడు సందర్శిద్దామా అన్న ఆకాంక్షతో వేగిపోతున్నాయి. ఇక నారదుడైతే చెప్పనవసరమే లేదు. రమాదేవి వచ్చి తన మెడలో పుష్పమాల వేసినట్టూ, ఆమెతో తాను స్వర్గసుఖాలు అనుభవిస్తున్నట్టు ఊహాలోకంలో తెలిపోతున్నాడు.

అలా ఎవరి ఊహల్లో వారు తన్మయులై ఉన్న వేళ … ఒక్కసారి కళ్యాణపురాధీశుడు మండపాన్ని చేరుకోవడంతో వారి ఊహాలోకానికి తెరపడ్డట్లయింది. ఆస్థాన పురోహితుడు వేదమంత్రాలు చదువుతుంటే, శ్రావ్యమైన రీతిలో మంగళవాద్యాలు మిన్నంటి మోగుతుంటే, చేతిలో పూలమాల పట్టుకుని అందమైన మేలిముసుగులో అనేకమంది చెలికత్తెలు వెంటరాగా, సౌకుమార్యంగా నడుచుకుంటూ సభామండపాన్ని చేరుకుంది రమాదేవి. రాజు మాట్లాడుతూ ఇప్పుడు మీలో ఒకరి గళసీమలోనో నా కూతురు వరమాలను వేస్తుంది. ఆ భాగ్యశాలి నాకు అల్లుడు’’ అని, వెంటనే కూతురివైపు చూసి ఇలా అన్నాడు. ”తల్లీ! ఇంతమంది రాజులలో నీకు నచ్చిన వరుడెవరో తేల్చుకునే శుభ తరుణం ఇది. ఆలస్యమైనా బాగా ఆలోచించుకుని నీ భాగస్వామిని ఎంచుకో’’మని ఆదేశించాడు. తండ్రి మాటకోసమే ఎదురుచూస్తున్న ఆ పూబోణి అప్పటికే తాను ఎవర్ని కట్టుకోవాలో మనసులో గట్టిగా నిర్ణయించుకోవడంతో అంతే స్థిరంగా రాకుమారులవైపు అడుగుల్ని కదిపింది. ఆమె కళ్ళు తన మనోహరుడి కోసం వెతుకులాడుతుండగా ముందుకు నడిచింది. అందరినీ దాటుకుంటూ వెళ్లి మె అడుగులో అడుగు వేసుకుంటూ సరాసరి నారదుని దగ్గరకే వస్తోంది. రావడమేమిటి? ఆ చేతిలోని వర(విరి)మాలను ఏమాత్రం ఆలోచించకుండా మెడలో వేసెయ్యడమేమిటి.. అంతా క్షణంలో జరిగిపోయింది.

పట్టలేని ఆనందంతో ఆమె మృదువైన కరకమలాన్ని తన చేతిలోకి తీసుకుని వెంట తీసుకుపోయేందుకు ప్రయత్నించాడు నారదుడు. ఇంతలో ”వదులు … వదులు” అన్న పెనుగులాటతో నారదుడు బాహ్యస్మృతిలోకి వచ్చాడు. అప్పటికే రాజులందరితోపాటు వారి మధ్యలో కోటి సూర్యప్రభాసమానుడై వెలుగొందుతున్న శ్రీమహావిష్ణువును రమాదేవి చూడడం, పులకించిన మదితో తన హృదయనాథుడైన శ్రీహరి గళసీమలో పుష్పమాలను అలంకరించడం జరిగిపోయింది.

వెంటనే విష్ణువు తన వాహనమైన గరుడునిపైన ఈమెను ఎక్కించుకుని వైకుంఠానికి తరలిపోవడం కూడా జరిగిపోయింది. ఇప్పుడు నారదుడు, తన పక్కనున్న రాకుమారుని చేయి పట్టుకుని తీసుకుపోయేందుకు ప్రయత్నించగా వదలమని కేకలు వేసింది అతనే. ఈ దృశ్యం చూసి అక్కడ ఉన్నవారంతా పకపకా నవ్వసాగారు. ఆ నవ్వుతో నారదుడు తాను చేసినదేమిటో గ్రహించి సిగ్గుపడి తలవంచుకుంటాడు. అయినప్పటికీ రాజులు నవ్వు ఆపకపోవడంతో ఎందుకు నవ్వుతున్నారంటూ కోపంగా ప్రశ్నించాడు. ”నీ శరీరాకృతి చూసేందుకు శ్రీహరిలా కనిపిస్తున్నప్పటికీ ముఖం మాత్రం ఎలుగుబంటును, కోతిని పోలివుంది. ఇక నిన్ను చూసి నవ్వక ఏం చెయ్యమంటావు?’’ అని ఎదురు ప్రశ్నించారు. అంతే..తనకు జరిగిన ఘోరమైన ఈ అవమానానికి ఏం చెయ్యాలో తెలియక, తోకతొక్కిన తాచులా కూర్చున్న చోటునుంచి సర్రున లేచి అక్కడినుంచి కోపంతో వైకుంఠానికి బయల్దేరి వెళ్ళాడు. వైకుంఠంలో రమాదేవితో ఉన్న విష్ణువును చూడగానే నారదుడి కోపం నషాళానికి అంటింది. అప్పుడు శ్రీహరి నారదుడికి చేసిన తప్పును వివరించాడు. దాంతో నారదుడు పశ్చాత్తాప పడి, స్వామిని ప్రాధేయపడ్డాడు. తన తప్పును మన్నించమని వేడుకుంటాడు. అదండి బ్రహ్మచారి నారదుడు కన్యపై మోజుపడి స్వయం వరానికి హాజరైన కథ.

– కేశవ

Read more RELATED
Recommended to you

Exit mobile version