వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2025 టోర్నీని సౌతాఫ్రికా కైవసం చేసుకుంది. భారత్ ఛాంపియన్స్, సెమీ ఫైనల్ ఆడేందుకు ఇష్టపడకపోవడంతో సెమీస్ ఆడకుండానే ఫైనల్ చేరిన పాకిస్తాన్ ఛాంపియన్స్, సౌతాఫ్రికా చేతుల్లో చిత్తుగా ఓడింది. ఈ ఏడాది సౌతాఫ్రికా క్రికెట్ టీమ్ సెమీస్ లో ఆస్ట్రేలియాని ఓడించి వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2025 టైటిల్ గెలిచింది. ఫైనల్ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ ఛాంపియన్స్ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసింది.
కమ్రాన్ అక్మల్ 2 పరుగులు చేయగా కెప్టెన్ మహ్మద్ హఫీజ్ 17 పరుగులు చేశాడు. షార్జీల్ ఖాన్ 44 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 76 పరుగులు చేయగా షోయబ్ మాలిక్ 25 బంతుల్లో 20 పరుగులు చేశాడు. ఉమర్ ఆమీన్ 19 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 36 పరుగులు చేశాడు. ఆసిఫ్ ఆలీ 28 పరుగులు చేశాడు. 196 పరుగుల లక్ష్యాన్ని 16.5 ఓవర్లలోనే సునాయాసంగా ఛేదించింది సౌతాఫ్రికా ఛాంపియన్స్ జట్టు.. హషీమ్ ఆమ్లా 18 పరుగులు చేసి అవుట్ కాగా ఏబీ డివిల్లియర్స్ 60 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్సర్లతో 120 పరుగులతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. జాన్ పాల్ డుమిని 28 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 50 పరుగులు చేశాడు. 4, 6 బాది హాఫ్ సెంచరీతో మ్యాచ్‌ని ముగించేశాడు డుమిని.