భారత క్రికెట్ జట్టు 2011 ప్రపంచ కప్‌ను గెలుచుకున్న మ్యాచ్ ఫిక్సయిందని, ఈ అంశంపై విచారణ చేపట్టాలని అప్పటి శ్రీలంక క్రీడాశాఖ మంత్రి మహిందానంద అలుత్గమాగె సంచలన ఆరోపణలు చేసిన విషయం విదితమే. కాగా అప్పటి శ్రీలంక జట్టు కెప్టెన్ కుమార సంగక్కరతోపాటు అదే మ్యాచ్‌లో ఆడిన శ్రీలంక ప్లేయర్ మహేళ జయవర్ధనెలు ఈ ఆరోపణలను ఖండించారు. అయితే ఈ వివాదం ఇప్పుడప్పుడే సద్దుమణిగేలా కనిపించడం లేదు. తాజాగా శ్రీలంక లెజెండరీ బ్యాట్స్‌మన్ అరవింద డిసిల్వా ఈ వివాదంపై స్పందించారు.
2011 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఫిక్స్ అయి ఉంటే ఐసీసీఐ, బీసీసీఐ, శ్రీలంక క్రికెట్ బోర్డులు వెంటనే స్పందించి తగిన విచారణ చేపట్టాలని డిసిల్వా అన్నారు. సదరు మ్యాచ్‌పై ఎప్పటికప్పుడు కొందరు ఇలాంటి ఆరోపణలు చేస్తూనే ఉన్నారని, ఇది ఇరు దేశాల క్రికెట్‌కు మంచిది కాదన్నారు. సచిన్ లాంటి దిగ్గజ బ్యాట్స్‌మన్ తన హోం గ్రౌండ్లో వరల్డ్ కప్‌ను లిఫ్ట్ చేశాడని, అది అతనికి చిరస్మరణీయ జ్ఞాపకంగా మిగిలిపోతుందని అన్నారు. అయితే ఆ విజయాన్ని సచిన్ మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేయాలంటే.. ఫిక్సింగ్ లాంటి మచ్చ ఉండకూడదని, అందులో నిజానిజాలు ఏంటో తేల్చాల్సిన అవసరం ఉందన్నారు.
ఆ మ్యాచ్ ఫిక్స్ అయ్యిందీ, లేనిదీ.. ఆయా బోర్డులతోపాటు ఐసీసీ విచారించి నిజాలను నిగ్గు తేల్చాలని, లేదంటే ఇలాంటి ఆరోపణలు చేస్తూనే ఉంటారని డిసిల్వా అన్నారు. అలాంటి వారి నోళ్లను మూయించాలంటే.. ఒక్కసారి ఈ విషయంపై విచారణ చేపట్టి.. అసలు నిజాలు ఏమిటో తేల్చాల్సిన అవసరం ఉందన్నారు. ఈ క్రమంలో డిసిల్వా.. మహిందానంద చేసిన ఆరోపణలను ఖండించారు. కాగా ఆ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న లంక జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 275 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన భారత జట్టు అలవోకగా లక్ష్యాన్ని ఛేదించింది. గంభీర్ (97), ధోనీ (91*) లు రాణించడంతో భారత్ 1983 తరువాత రెండో సారి వన్డే ప్రపంచ కప్‌ను ముద్దాడింది.