భారత దేశ అథ్లెటిక్స్ చరిత్రలో భరతమాతను స్వర్ణ పతకం ముద్దాడేలా చేసిన బల్లెం అది. అలాంటి జావెలిన్‌ను మన గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా ప్రధాని నరేంద్ర మోదీకి బహుమతిగా నీరజ్ చోప్రా ఇచ్చాడు. మోదీ సేకరించిన మెమెంటోలను గతేడాది ఈ-ఆక్షన్‌లో పెట్టగా.. జావెలిన్‌కు రూ.1.5 కోట్లకు బిడ్ వచ్చింది. భారీ మొత్తంతో దక్కించుకున్నదెవరని అప్పట్లోనే చర్చ సాగింది. తాజాగా ఆ వివరాలు బయటకొచ్చాయి.
ఆ జావెలిన్‌ను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) సొంతం చేసుకున్నట్లు తెలిసింది. ఈ-వేలం ద్వారా వచ్చే సొమ్మును ‘నమామీ గంగే’ కార్యక్రమం కోసం వెచ్చించనున్నారు. గతేడాది సెప్టెంబర్-అక్టోబర్ మధ్య ఈ-వేలం జరిగింది.
ఒలింపిక్స్ అనంతరం నీరజ్ చోప్రా తన బల్లెం మోదీకి చూపించాడు. అప్పుడు ‘నువ్వు దీనిపై సంతకం చేశావు. నేను దీన్ని వేలం వేస్తాను. ఇబ్బందేం లేదుగా?’ అని ప్రధాని అతడితో అన్నారు. చిరునవ్వుతో స్పందించిన నీరజ్.. తన జావెలిన్‌ను మోదీకి బహుకరించాడు.