ఐపీఎల్ 16వ సీజన్‌లో లక్నో టీమ్ మెంటార్ గౌతం గంభీర్, బెంగళూరు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ మధ్య తీవ్ర వివాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ వివాదంపై గంభీర్ మొదటిసారిగా స్పందించాడు. ‘ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ లేదా ఇతర ఏ ఆటగాడితోనైనా.. నా అనుబంధం ఒకేలా ఉంటుంది. మా మధ్య ఏదైనా వివాదం చోటుచేసుకుంటే.. అది మైదానం వరకు మాత్రమే పరిమితం. వ్యక్తిగతంగా ఏమీ ఉండదు. నాలాగే వాళ్లు కూడా గెలవాలని కోరుకుంటాను’ అంటూ ఈ వివాదంపై ముగింపు పలికాడు గంభీర్.
ఇక అప్పటి ఘటనను వివరిస్తూ.. ‘నేను ఒక్కటే చెబుతాను. ఆ సమయంలో నేను చేసినదాన్ని సమర్థించుకుంటున్నా. నవీనుల్ తప్పు చేయలేదని భావిస్తే.. అతడి వెంట నిలబడటం నా బాధ్యత. అక్కడ నవీనుల్ ఉన్నా.. ఇతర వ్యక్తి ఉన్నా.. నా చివరి శ్వాస వరకూ అదే చేస్తా. మీరు సరైనవారని నేను భావిస్తే.. నేను మీవైపే ఉంటా.’ అంటూ వివరణ ఇచ్చాడు.