కరోనా నేపథ్యంలో ప్రపంచంలో ప్రజల జీవన విధానమే పూర్తిగా మారిపోయింది. ఈ మహమ్మారి ఇంకా ఎన్ని రోజుల పాటు ఉంటుందో తెలియదు. అందువల్ల అప్పటి వరకు కచ్చితంగా జాగ్రత్తలను పాటిస్తూ జీవించడం అత్యంత ఆవశ్యకం అయింది. అయితే కరోనా ప్రభావం క్రికెట్‌పై కూడా పడింది. దీంతో క్రికెట్ మ్యాచ్‌లను కఠినమైన బయో సెక్యూర్ బబుల్ వాతావరణంలో నిర్వహిస్తున్నారు. ఇక తాజాగా దుబాయ్‌లో ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ను కూడా కఠినమైన నిబంధనలతో నిర్వహిస్తున్నారు. అయితే ఐపీఎల్లో అనేక మ్యాచ్‌లలో కెప్టెన్లు సహా పలువురు ప్లేయర్లు అప్పుడప్పుడు తమ నెత్తిపై ఒకటి కాకుండా రెండు టోపీలు ధరిస్తూ కనిపిస్తున్నారు. దీంతో ఆ రెండు టోపీల కథ ఏమిటా అని ఇప్పుడు క్రికెట్ అభిమానులు తీవ్రంగా ఆలోచిస్తున్నారు.
కరోనా నేపథ్యంలో క్రికెట్ మ్యాచ్‌లలో ప్లేయర్లు ఐసీసీ విధించిన రూల్స్ ను పాటిస్తూ ఆడాల్సి వస్తోంది. అందులో భాగంగానే ప్లేయర్లు సామాజిక దూరం పాటిస్తున్నారు. బంతిపై ఉమ్మి రాయడాన్ని నిషేధించారు. ఇక గతంలో బౌలింగ్ చేసే బౌలర్లు తమ స్వెటర్, క్యాప్ లను అంపైర్లకు ఇచ్చేవారు. కానీ కరోనా నేపథ్యంలో ఐసీసీ ఆ రూల్‌ను మార్చింది. ఈ క్రమంలో బౌలర్లు తమ జట్టు కెప్టెన్ లేదా ఇతర ప్లేయర్లకు తమ క్యాప్‌ను, ఇతర వస్తువులను అందజేస్తున్నారు. అందుకనే ఐపీఎల్లో పలువురు ప్లేయర్లు, కెప్టెన్లు ఏకంగా రెండు రెండు క్యాప్‌లను పెట్టుకుని మనకు కనిపిస్తున్నారు. అదీ అసలు విషయం.
ఈ నిబంధనలను ఐసీసీ కరోనా అనంతరం క్రికెట్ పునః ప్రారంభమైనప్పటి నుంచి అమలు చేస్తోంది. అందులో భాగంగానే ఐపీఎల్‌లోనూ అవే నిబంధనలను పాటిస్తున్నారు. అయితే బౌలర్లు లేదా ఇతర ప్లేయర్లు బంతికి ఉమ్మి రాస్తే మొదటి రెండు సార్లు అంపైర్లు హెచ్చరిస్తారు. మూడోసారికి 5 పరుగుల ఫైన్ విధిస్తారు. ఇలా పలు నిబంధనలను కరోనా అనంతరం నుంచి ఐసీసీ అమలు చేస్తోంది.