కోవిడ్ వల్ల గతేడాది ఆస్ట్రేలియాలో జరగాల్సిన టీ20 వరల్డ్ కప్ వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. అయితే ఆ వరల్డ్ కప్‌ను ఈ ఏడాది భారత్‌లో నిర్వహించనున్నారు. అక్టోబర్‌లో ఆ మెగా టోర్నీ జరగనుంది. మొత్తం 16 టీమ్‌లు ఈ కప్‌లో పాల్గొంటున్నాయి. అయితే ఈసారి వరల్డ్ కప్ పూర్తిగా భారత్‌లో జరుగుతుంది కనుక పాక్ ప్లేయర్లకు మన దేశానికి వచ్చేందుకు అనుమతిస్తారా, వీసాలను మంజూరు చేస్తారా ? అని నిన్న మొన్నటి వరకు సందేహాలు ఉండేవి. కానీ ఇప్పుడవి తీరిపోయాయి.
ఈ ఏడాది అక్టోబర్‌లో భారత్‌లో జరగనున్న టీ20 వరల్డ్ కప్‌లో ఆడేందుకు పాక్ ఆటగాళ్లకు భారత్ వీసాలను మంజూరు చేయనుంది. ఈ మేరకు బీసీసీఐ సెక్రెటరీ జై షా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఏపెక్స్ కౌన్సిల్‌కు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాక్ ఆటగాళ్ల వీసా సమస్య ఇప్పటికైతే పరిష్కారం అయింది. దీంతో వారు భారత్‌కు వచ్చి టీ20 వరల్డ్ కప్‌లో ఆడుతారు. కానీ అక్కడి అభిమానులకు ఇక్కడికి వచ్చి స్టేడియాల్లో మ్యాచ్‌లను చూసేందుకు ఇంకా అనుమతి లేదు. ఈ విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.. అని అన్నారు.
కాగా భారత్, పాక్‌ల మధ్య ఎన్నో ఏళ్లుగా నెలకొన్న పొలిటికల్ టెన్షన్స్ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. అయితే ఇటీవలే ఇందుకు సంబంధించి ఓ వార్త వైరల్ అయింది. భారత్, పాక్‌లు రహస్యంగా చర్చలు జరుపుతున్నాయని, అందువల్ల ఇరు దేశాలు మళ్లీ క్రికెట్ ఆడుతాయని వార్తలు వచ్చాయి. కానీ ఇందులో స్పష్టత లేదు. ఇక అక్టోబర్‌లో టీ20 వరల్డ్ కప్ ను మొత్తం 9 వేదికల్లో నిర్వహించనున్నారు. కొత్తగా నిర్మించిన నరేంద్ర మోదీ స్టేడియంతోపాటు ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్, ధర్మశాలలో మ్యాచ్‌లను నిర్వహించనున్నారు.