ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు గాను ఇటీవలే 13వ సీజన్ ముగిసిన విషయం విదితమే. ఈ క్రమంలోనే త్వరలో మళ్లీ ఇంకో సీజన్ ప్రారంభం కానుంది. ఇక ఈ నెల 18వ తేదీన 100 మందికి పైగా ప్లేయర్లకు మళ్లీ వేలం నిర్వహించనున్నారు. అయితే శుక్రవారం నుంచి భారత్, ఇంగ్లండ్‌ల మధ్య టెస్టు సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో భారత జట్టు వైస్ కెప్టెన్ అజింక్యా రహానే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఐపీఎల్‌లో ఆడినప్పుడు విదేశీ ప్లేయర్లతో డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకుంటాం. వికెట్లు తీసినప్పుడు అందరం కలిసి ఎంజాయ్ చేస్తాం. మ్యాచ్ గెలిస్తే డ్రెస్సింగ్ రూమ్‌లో సెలబ్రేట్ చేసుకుంటాం. మ్యాచ్ గెలిచేందుకు వ్యూహాలు రచిస్తాం. కానీ ఐపీఎల్‌లో విదేశీ ప్లేయర్లతో అన్నీ పంచుకోము. ఎంత వరకు ఉండాలే అంత వరకే ఉంటాం. అన్నీ విదేశీ ప్లేయర్లకు చెప్పం.. అని రహానే అన్నాడు.
ఇక శుక్రవారం నుంచి జరగనున్న టెస్టు సిరీస్ పట్ల స్పందిస్తూ.. ఐపీఎల్ వైట్ బాల్ గేమ్. పరిమిత ఓవర్లు ఉంటాయి. అందులో వేగంగా సమీకరణాలు మారుతుంటాయి. టెస్టు క్రికెట్ వేరు. ఇందులో ఓవర్లు ఎక్కువగా ఉంటాయి. అలాగే బంతి కూడా వేరేది. కనుక టీ20లకు టెస్టులకు చాలా తేడా ఉంటుంది. అయినప్పటికీ ఇంగ్లండ్ టీం పటిష్టంగా ఉంది. జాస్ బట్లర్, స్టోక్స్, ఆర్చర్ వంటి కీలక ప్లేయర్లు ఉన్నారు. ఇటీవల ఆ టీం శ్రీలంకను వారి దేశంలోనే ఓడించి సిరీస్‌ను కైవసం చేసుకుంది. కనుక ఆ టీంతో జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుంది.. అని రహానే అన్నాడు.
కాగా భారత్, ఇంగ్లండ్‌ల మధ్య చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో శుక్రవారం నుంచి తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. పేటర్నిటీ లీవ్ అనంతరం విరాట్ కోహ్లి టీమిండియాతో చేరగా కోహ్లి ఈ సిరీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.