ప్రస్తుతం ఆస్ట్రేలియా ఓపెన్ జరుగుతున్న విషయం తెలిసిందే. 25వ గ్రాండ్ స్లామ్ టైటిల్ దిశగా సెర్బియా టెన్నిస్ దిగ్గజం నోవాక్ జకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ లో కీలక అడుగు వేశాడు. మెన్స్ సింగిల్స్ సెమీస్ కి దూసుకెళ్లాడు. క్వార్టర్స్ లో బలమైన అల్కరాజ్ (స్పెయిన్)ను మట్టికరిపించాడు. ఆసక్తికరంగా సాగిన పోరులో జకో 4-6, 6-4, 6-3, 6-4 తేడాతో విజయం సాధించాడు. దీంతో అల్కారాజ్ మరోసారి క్వార్టర్స్ లోనే ఇంటిదారిపట్టాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్లో జకోకు ఇది 99వ విజయం కావడం విశేషం.
దాదాపు 3 గంటల 37 నిమిషాలపాటు జకోవిచ్, అల్కరాజ్ మధ్య రసవత్తర పోరు సాగింది. మొదట శుభారంభం చేసింది అల్కరాజే. తొల సెట్ ని దక్కించుకున్నాడు. ఆ తర్వాత జకో బలంగా పుంజుకున్నాడు. అల్కరాజ్ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైనప్పటికీ తన అనుభవాన్ని ప్రదర్శించాడు. వరుసగా మూడు సెట్లు నెగ్గి మ్యాచ్ ని సొంతం చేసుకున్నాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నీలో జకో సెమీస్లో అడుగుపెట్టడం ఇది 12వ సారి. అన్ని గ్రాండ్ ముల్లో ఇది 50వ సెమీస్. జర్మనీ ప్లేయర్ అలెగ్జాండర్ జ్వెరెవ్ కూడా సెమీస్ కు చేరుకున్నాడు. క్వార్టర్స్లో అమెరికా ఆటగాడు టామీ పాల్ ని దాటడానికి అతను తీవ్రంగా చెమటోడ్చాడు. హోరాహోరీగా సాగిన మ్యాచ్లో జ్వెరెవ్ 7-6(7-1), 7-0(7-0), 2-6, 6-1 తేడాతో పాల్ ని చిత్తు చేశాడు.సెమీస్ లో జకోవిచ్, జ్వెరెవ్ తలపడనున్నారు.