ఆర్చరీ ప్రపంచకప్ పోటీల్లో భారత్ మరోసారి సత్తా చాటింది. మహిళల సింగిల్స్ సహా మహిళలు, పురుషులు, మిక్స్ డ్ డబుల్స్ ఈవెంట్లలో ఇప్పటికే బంగారు పతకాలు సాధించిన విషయం తెలిసిందే. తాజాగా భారత్ మరో స్వర్ణాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇప్పటికే భారత కాంపౌండ్ ఆర్చర్లు మొత్తం ఐదు పతకాలు గెలవగా తాజాగా మెన్స్ రికర్వ్ విభాగంలో ధీరజ్ బొమ్మదేవర, తరుణ్‌దీప్ రాయ్, ప్రవీణ్ జాదవ్‌లతో కూడిన బృందం స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. ఫైనల్‌లో ఈ బృందం దక్షిణ కొరియా జట్టును ఓడించింది.
ఒలింపిక్ ఛాంపియన్‌లుగా నిలిచిన దక్షిణ కొరియాను 5-1తో మట్టికరిపించిన ధీరజ్ నేతృత్వంలోని బృందం అంతర్జాతీయ వేదికపై భారత్ సత్తాను చాటింది. దక్షిణ కొరియాపై భారత్ 57-57, 57-55, 55-53తో విజయం సాధించింది. ఈ విజయంతో ఆర్చరీ ప్రపంచకప్‌లో భారత్ ఇప్పటివరకూ అయిదు స్వర్ణ పతకాలు ఒక రజత పతకం సాధించింది. ఇవాళ మహిళల రికర్వ్ సెమీఫైనల్‌లో కొరియా ప్రత్యర్థితో దీపికా కుమారి తలపడనుంది.