హ‌త‌విధీ.. సౌతాఫ్రికా, వెస్టిండీస్‌ మ్యాచ్ కూడా వ‌ర్షార్ప‌ణ‌మే..!

-

ఐసీసీ క్రికెట్‌ వ‌ర‌ల్డ్ క‌ప్ 2019 టోర్న‌మెంట్‌లో వ‌రుణుడు అటు ప్లేయ‌ర్ల‌కే కాదు.. మ్యాచ్ ను చూసే ప్రేక్ష‌కుల‌కు కూడా విసుగు తెప్పిస్తున్నాడు. ఇప్ప‌టికే వ‌ర్షం కార‌ణంగా పాకిస్థాన్‌, శ్రీ‌లంక మ్యాచ్ ర‌ద్దు కాగా ఆ రెండు జ‌ట్ల‌కు చెరొక పాయింట్‌ను ఇచ్చారు. ఇక ఇవాళ జ‌రగాల్సిన సౌతాఫ్రికా, వెస్టిండీస్ మ్యాచ్ కూడా వ‌ర్షం కార‌ణంగా ర‌ద్ద‌యింది. దీంతో ఇరు జ‌ట్ల‌కు అంపైర్లు చెరొక పాయింట్‌ను ఇచ్చారు.

కాగా సౌతాంప్టన్‌లోని ది రోజ్‌బౌల్ మైదానంలో ఇవాళ జ‌ర‌గాల్సిన సౌతాఫ్రికా, వెస్టిండీస్ వరల్డ్ కప్ 2019 టోర్నీ 15వ మ్యాచ్‌లో టాస్ గెలిచిన వెస్టిండీస్ జట్టు సౌతాఫ్రికాను బ్యాటింగ్‌కు ఆహ్వానించగా.. ఆ జట్టు బ్యాట్స్‌మెన్‌ 7.3 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 29 పరుగులు చేశారు. హషీం ఆమ్లా (7 బంతుల్లో 6 పరుగులు, 1 ఫోర్), మార్క్రం (10 బంతుల్లో 5 పరుగులు, 1 ఫోర్)లు ఔట‌వ్వ‌గా, క్వింటన్ డి కాక్ (21 బంతుల్లో 17 పరుగులు, 1 ఫోర్), కెప్టెన్ డుప్లెసిస్ (7 బంతుల్లో 0 పరుగులు)లు కొద్ది సేపు ఆట ఆడారు. ఇక వెస్టిండీస్ బౌలర్లలో షెల్డన్ కాట్రెల్ కు 2 వికెట్లు ద‌క్కాయి.

అయితే కొద్ది సేప‌టికి మ్యాచ్‌కు వ‌ర్షం అడ్డంకిగా మారింది. వర్షం పడడంతో ఆటను నిలిపివేశారు. అయితే మ‌ధ్య‌లో వ‌ర్షం త‌గ్గినా.. కొంత‌సేప‌టికి మ‌ళ్లీ వాన పుంజుకుంది. దీంతో ఎట్టి ప‌రిస్థితిలోనూ మ్యాచ్‌ను నిర్వ‌హించే అవ‌కాశం లేక‌పోయే స‌రికి అంపైర్లు మ్యాచ్‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. దీంతో సఫారీలు, విండీస్ జ‌ట్టు చెరొక పాయింట్‌ను పంచుకున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version