టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఘనత సాధించారు. టెస్ట్ చరిత్రలోనే అత్యుత్తమ యావరేజ్ కలిగిన రెండో బౌలర్ గా ఆయన నిలిచారు. 41 మ్యాచ్ లలో 177 వికెట్లు తీసి 20.17 యావరేజ్ కలిగి ఉన్నారు. అగ్ర స్థానంలో సిడ్నీ బార్న్స్ 16.43 ఉన్నారు. వీరిద్దరి తరువాత అలెన్ డేవిడ్ సన్ 20.53, మాల్కమ్ మార్షల్ 20.94, జోయల్ గార్నర్ 20.97 కొనసాగుతున్నారు. ఇవాళ ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్ట్ లో బుమ్రా ఈ రికార్డు సాధించాడు.
ముఖ్యంగా బుమ్రా 4 కీలక వికెట్లు తీసి ఆసీస్ జట్టు వెన్ను విరిచాడు. బుమ్రా విసిరిన బుల్లెట్ బంతులకు ఆస్ట్రేలియన్ల వద్ద సమాధానం కూడా లేకుండా పోయింది. మరో ఎండ్ లో సిరాజ్ కూడా 2 వికెట్లు పడగొట్టి ఆసీస్ ను దెబ్బతీశాడు. టీమిండియా తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఆస్ట్రేలియా ఇంకా 83 పరుగుల వెనుకబడి ఉంది. తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 150 పరుగులకు ఆలౌట్ అయింది. మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ 7 వికెట్లు కోల్పోయి 67 పరుగులు మాత్రమే చేయగలిగింది. వికెట్ కీపర్ అలెక్స్ కేరీ 19 పరుగులే ఆ జట్టులో అత్యధికం కావడం విశేషం.