శ్రీలంక మాజీ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన తాజాగా ఆ దేశ క్యాథలిక్ సమాజానికి క్షమాపణలు చెప్పారు. దేశాన్ని కుదిపేసిన ఈస్టర్ బాంబు దాడుల ఘటనపై ప్రజలను క్షమించమని కోరారు. 2024లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని కూడా ప్రకటించారు.
ఐసిస్‌తో సంబంధం ఉన్న ఉగ్రవాదులు 2019 ఏప్రిల్‌లో ఇక్కడి మూడు ప్రార్థనా మందిరాలతోపాటు అనేక హోటళ్లలో వరుస ఆత్మాహుతి దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనల్లో దాదాపు 270 మంది మృతిచెందారు. 500 మందికి పైగా గాయపడ్డారు. ముందస్తు నిఘా సమాచారం ఉన్నా.. దాడులను నిర్మూలించలేకపోయారని అప్పటి అధ్యక్షుడు సిరిసేన, ప్రధాని రణిల్ విక్రమసింఘేలపై విమర్శలు వెల్లువెత్తాయి.
తాజాగా ‘శ్రీలంక ఫ్రీడం పార్టీ’ నేతల సమావేశంలో సిరిసేన మాట్లాడుతూ.. ఇతరులు చేసిన పనికి తాను క్యాథలిక్ సమాజానికి క్షమాపణలు చెబుతున్నానన్నారు. ఇదే వ్యవహారంలో శ్రీలంక సుప్రీం కోర్టు.. సిరిసేనకు ఇటీవల రూ.2.2 కోట్ల(2.73 లక్షల డాలర్లు) జరిమానా విధించిన వేళ ఈ వ్యాఖ్యలు వచ్చాయి.