కరోనా వైరస్ జనాన్ని ఎంత టెన్షన్ పెడుతుందో అందరికీ తెలిసిందే. దీని దెబ్బకు రకరకాల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ మధ్య కాలంలో సీఫుడ్ వల్ల కరోనా వైరస్ వ్యాపిస్తుందనే ప్రచారం జరిగింది. దీంతో చాలా చోట్ల ప్రజలు సీఫుడ్‌కి దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో శ్రీలంకకు చెందిన ఓ మాజీ మంత్రి ప్రజల్లో ఇదంతా పుకారే అని తేల్చేందుకు ఏకంగా పచ్చి చేపనే నమిలి తినేశారు.
ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. శ్రీలంకకు చెందిన దిలీప్ 2019 వరకు మత్స్య శాఖ మంత్రిగా పనిచేశారు. సముద్ర ఆహారం వల్ల కూడా కోవిడ్-19 వ్యాపిస్తుందనే ప్రచారం వల్ల ప్రజలు అవి తినకుండా ఉంటున్నారని తెలియడంతో దిలీప్ తాను ఈ విషయానికి ఎలా అయినా బ్రేక్ చేయాలని భావించారు. ఈ ప్రచారం వల్ల జాలర్లకు ఉపాధి కరవవుతోందని భావించిన ఆయన.. సీ ఫుడ్ వల్ల ఆరోగ్యానికి ఎలాంటి సమస్య ఉండబోదని జనానికి చెప్పడానికి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి పచ్చి ఆ చేపను నోటితో కొరికి తిన్నారు.