అందరూ నమ్మినట్లుగా నటి శ్రీదేవి బాత్ టబ్‌లో పడి చనిపోలేదని, ఆమెను ఎవరో హత్య చేసి ఉంటారని, అనంతరం దాన్ని యాక్సిడెంటల్ డెత్‌గా చిత్రీకరించారని డీజీపీ రిషిరాజ్ సింగ్ అన్నారు.
ప్రముఖ నటి శ్రీదేవి మరణం అప్పట్లో ఎంత సంచలనం కలిగించిందో అందరికీ తెలిసిందే. దుబాయ్‌లో తన బంధువులకు చెందిన ఓ పెళ్లి వేడుకకు హాజరైన శ్రీదేవి అక్కడే ఉన్న ఓ హోటల్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. దీంతో అప్పట్లో ఆమె మరణంపై అనేక సందేహాలు ఏర్పడ్డాయి. మొదట ఆమె మరణానికి హార్ట్ ఎటాక్ కారణమని ఆమె కుటుంబ సభ్యులు చెప్పారు. కానీ ఆమె మద్యం మత్తులో బాత్ టబ్‌లో పడి మునిగి చనిపోయిందని డాక్టర్లు తేల్చారు. దీంతో దుబాయ్ పోలీసులు కూడా అదే వివరాలను నమోదు చేసుకుని కేసు క్లోజ్ చేశారు. కానీ ఇప్పటికీ ఆమె మృతి పట్ల అభిమానుల్లో అనేక సందేహాలు ఉన్నాయి. ఆమెది సహజ మరణమా, హత్య చేశారా..? అన్న విషయంలో అభిమానులకు అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కాగా ప్రస్తుతం కేరళకు చెందిన జైళ్ల శాఖ డీజీపీ రిషిరాజ్ సింగ్ శ్రీదేవి మరణంపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి.
డీజీపీ రిషిరాజ్ సింగ్ శ్రీదేవి మరణంపై తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. అందరూ నమ్మినట్లుగా నటి శ్రీదేవి బాత్ టబ్‌లో పడి చనిపోలేదని, ఆమెను ఎవరో హత్య చేసి ఉంటారని, అనంతరం దాన్ని యాక్సిడెంటల్ డెత్‌గా చిత్రీకరించారని అన్నారు. కొన్ని కీలక ఆధారాలను బట్టి చూస్తే శ్రీదేవిది ప్రమాదమరణం కాదని, హత్యేనని రుజువవుతుందని అన్నారు. శ్రీదేవి ఒక వేళ నిజంగానే మద్యం అతిగా సేవించి బాత్ టబ్‌లో పడిపోయి ఉంటే కేవలం ఒక అడుగు మాత్రమే ఉన్న నీళ్లలో మునిగి చనిపోవడం అసాధ్యమని, వెనుక నుంచి ఎవరైనా బలంగా తోస్తే ఆమెకు గాయమై బాత్ టబ్‌లో పడిపోయి ఉంటుందని, ఆ తరువాత చనిపోయి ఉంటుందని అన్నారు.
శ్రీదేవి మరణంపై రిషిరాజ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు మీడియాలో పెను సంచలనాన్నే కలిగిస్తున్నాయి. కాగా ఆయన ఇంటర్వ్యూను కేరళకు చెందిన కౌముది అనే పత్రిక ప్రచురించింది. తన ఫ్రెండ్, ఫోరెన్సిక్ సర్జన్ డాక్టర్ ఉమాదతన్ చెప్పిన విషయాలను తాను చెబుతున్నానని కూడా రిషిరాజ్ సింగ్ అన్నారు. కాగా శ్రీదేవి మరణంపై ఇప్పటికీ అందరిలోనూ సందేహాలు ఉండగా.. ఓమన్‌లో ఆమె పేరిట రూ.240 కోట్ల ఇన్సూరెన్స్ పాలసీ ఉందని, అందుకనే ఆమెను హత్య చేసి ఉంటారని కూడా అప్పట్లో ప్రచారం సాగింది. మరి ఇప్పుడు తాజాగా వస్తున్న వార్తల నేపథ్యంలో శ్రీదేవి కుటుంబ సభ్యులు ఎలా స్పందిస్తారో వేచి చూస్తే తెలుస్తుంది..!