చంద్రగ్రహణం కారణంగా నేడు తెలుగు రాష్ట్రాలలోని దేవాలయాలు అన్ని మూసివేస్తారు. తెలుగు రాష్ట్రాలలోని తిరుమల, శ్రీశైలం, కొమురవెల్లి, వేములవాడ లాంటి పెద్ద పెద్ద దేవాలయాలు ఈరోజు మధ్యాహ్నం నుంచి రేపు ఉదయం వరకు మూసివేస్తారు. గ్రహణం పూర్తయిన తర్వాత యధావిధిగా దేవాలయాలను శుభ్రపరిచి భక్తులకు దర్శనానికి అనుమతి ఇస్తారు. ఈరోజు రాత్రి 10 గంటల నుంచి రేపు ఉదయం 1:30 వరకు గ్రహణం ఉంటుంది. గ్రహణం ఉన్నప్పటికీ శ్రీకాళహస్తి ఆలయం మాత్రం తెరిసే ఉంటుందని సమాచారం అందుతోంది. గ్రహణ సమయంలో చెడు ప్రభావం పడుతుందని అన్ని ఆలయాలను మూసివేస్తారు.

కానీ ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాళహస్తీశ్వర ఆలయం మాత్రం ఇందుకు భిన్నంగా ఉంటుంది. గ్రహణకాలంలో ఈ ఆలయం తెరిచి ప్రత్యేకమైన శాంతి పూజలు, అభిషేకాలు నిర్వహిస్తారు. కానీ భక్తులకు మాత్రం అనుమతి ఉండదు. గ్రహణ కాలంలో విడుదలయ్యే చెడు ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో నవగ్రహ కవచం ఉందని… దీనివల్ల దైవ శక్తి క్షీణించదని పండితులు పేర్కొన్నారు. ఆ కారణంగానే శ్రీకాళహస్తీశ్వర ఆలయం మూసి వేయడం లేదు. గ్రహణ సమయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి. గ్రహణ సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోకూడదు. ప్రత్యేకమైన నియమాలను పాటించి దైవారాధన చేసుకోవాలి.