పదో తరగతి క్వశ్చన్ పేపర్ లీకేజీ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా హిందీ పేపర్ లీకేజీ వ్యవహారంలో బీజేపీ నేతల హస్తం ఉందనే ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ పేపర్ లీకేజీకి మూలమయ్యాడంటూ ఓ విద్యార్థిని అధికారులు ఐదేళ్ల పాటు డీబార్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో తాను ఏ తప్పూ చేయలేదని, అయిదేళ్ల పాటు డిబార్ చేయడం అన్యాయమని బాధిత విద్యార్థి బోరున విలపించాడు.
హిందీ ప్రశ్నపత్రాన్ని నిందితుడికి అందజేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న హనుమకొండ కమలాపూర్‌లోని ఎంజేపీ బాలుర గురుకుల పాఠశాల విద్యార్థి.. గురువారం కమలాపూర్ జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ఆంగ్ల పరీక్ష రాయడానికి వచ్చాడు. అతన్ని హనుమకొండ డీఈవో పిలిచి ‘’నీ క్వశ్చన్ పేపర్ మూలంగా ముగ్గురు ఉద్యోగులు సస్పెండ్ అయ్యారు’’ అంటూ మందలించారు. పరీక్ష రాయవద్దంటూ బయటకు పంపారు.
తన హాల్‌టికెట్ తీసుకొని ఓ పత్రంపై సంతకం చేయించుకున్నారని విద్యార్థి విలపించాడు. ‘‘పరీక్ష కేంద్రంలో మొదటి ఫ్లోర్‌లోని మూడో నంబర్ గదిలో కిటికీ దగ్గర కూర్చుని హిందీ పరీక్ష రాస్తుండగా.. గోడ మీది నుంచి వచ్చిన ఓ బాలుడు.. ప్రశ్నపత్రం ఇవ్వాలని, లేకుంటే చంపుతానని బెదిరించాడు. ఇవ్వకపోయే సరికి లాక్కొని సెల్ ఫోన్‌లో ఫొటోలు తీసుకున్నాడు’’ అని తెలిపాడు.