కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ నిలిపివేయాలని మావోయిస్టు పార్టీ, దాని అనుబంధ సంఘాలు, పౌరహక్కుల సంఘాలు సైతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నాయి. మావోయిస్టుల ఏరివేతను ఆపి శాంతి చర్చలు జరపాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే మంగళవారం ఆపరేషన్ కగార్ ఆపాలంటూ మంత్రి సీతక్కకు హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో భారత్ బచావో సంస్థ ప్రతినిధులు గాదె ఇన్నయ్య, డాక్టర్ ఎమ్ ఎఫ్ గోపీనాథ్, జంజర్ల రమేష్ బాబు వినతి చేశారు. ఆపరేషన్ కగార్ ను నిలిపివేసేలా తన వంతు ప్రయత్నం చేయాలని మంత్రి సీతక్కను ఈ సందర్భంగా వారు విజ్ఞప్తి చేశారు. వేల సంఖ్యలో కేంద్ర బలగాలు కర్రెగుట్ట ప్రాంతాల్లో సంచరిస్తుండటంతో ఆదివాసీలు భయాందోళనకు గురవుతున్నారని మంత్రికి విన్నవించారు. ఆపరేషన్ కగార్‌ను తక్షణం నిలిపివేయకపోతే పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగే అవకాశం ఉందని ప్రతినిధులు పేర్కొన్నారు.ఈ అంశంపై మంత్రి సీతక్క సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.