Father’s Day ఎక్క‌డ పుట్టిందో.. ఎలా వ‌చ్చిందో.. ఎందుకు జ‌రుపుకోవాలో.. తెలుసా..?

-

అంతర్జాతీయ పితృ వంద‌న దినోత్సవము (Father’s Day) ను ప్రతి సంవత్సరం జూన్ నెలలోని మూడవ ఆదివారం నాడు జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా 52 దేశాలు తండ్రుల గౌరవార్థం ఈ దినోత్సవాన్ని పాటిస్తున్నాయి. తల్లుల గౌరవార్థంగా మాతృ వందన దినోత్సవం ఉండగా బాధ్యతకు మారు పేరుగా నిలిచే నాన్నలకు కూడా ఒక రోజును కేటాయించాలని అమెరికాకు చెందిన సోనోరా స్మార్ట్ డాడ్ అనే మహిళ ఆలోచించి ప్రచారం మొదలు పెట్టింది. ఆమె ఆలోచనలకు ప్రతిరూపంగా 1910లో మొదటిసారి ఫాదర్స్ డే ను గుర్తించి జరుపుకున్నారు.

ఆ తరువాత అలా అలా ఈ నాన్నల వందన దినోత్సవమునకు ఆదరణ పెరుగుతూ వచ్చింది. ప్రపంచ దేశాలు 1972 నుంచి ప్రతి సంవత్సరం జూన్ లో వచ్చే మూడో ఆదివారాన్ని పితృ వందన దినోత్సవముగా ప్రకటించుకొని జరుపుకుంటున్నాయి. అయితే, స్మార్ట్ డాడ్ ఆలోచ‌న వెనుక చాలా క‌థే ఉంది. డాడ్ అర్క‌న్‌సాస్ అనే ప్రాంతంలో జ‌న్మించారు. ఆమె తండ్రి విలియం జాక్స‌న్ స్మార్ట్‌. ఆయ‌న సైన్యంలో ప‌నిచేసేవారు. ఆయన‌కు ఆరుగురు పిల్ల‌లు పుట్టారు. అనారోగ్య కార‌ణంగా ఆయ‌న భార్య మృతి చెందారు. అయిన‌ప్ప‌టికీ.. పిల్ల‌ల‌కు ఎలాంటి లోటూ లేకుండా.. విలియం పోషించారు. వారి బాగోగులు అన్నీ కూడా ఆయ‌నే చూసుకున్నారు.

ఒక ప‌క్క‌సైన్యంలో విధులు నిర్వ‌హిస్తూనే.. మ‌రోప‌క్క‌, పిల్ల‌ల‌ను క్ర‌మ‌శిక్ష‌ణ‌తో పెంచి పెద్ద చేశారు. ఈ నేప‌థ్యంలోనే విలియం కుమార్తె డాడ్ త‌న తండ్రికి గుర్తుండిపోయేలా కానుక ఇవ్వాల‌నుకున్నారు. ఈ క్ర‌మంలోనే జూన్ మూడో ఆదివారం, 1910లో ఆమె తన తండ్రికి పితృ వంద‌న దినోత్స‌వం నిర్వ‌హించారు. అప్ప‌టి నుంచి ఇది అమెరికా స‌హా ప్ర‌పంచ దేశాల్లో పాటించ‌డం ప్రారంభ‌మైంది. అమెరికా, బ్రిట‌న్‌ల‌లో ఈ రోజును అత్యంత ఘ‌నంగా నిర్వ‌హిస్తారు. మ‌న దేశంలో గ‌డిచిన ద‌శాబ్ద కాలంగా దీనిని నిర్వ‌హిస్తున్నారు.
నిజానికి మ‌న భారతీయ సంప్ర‌దాయం ప్ర‌కారం.. నిత్యం పితృ వంద‌న‌పూజ ఉంది. మాతృదేవో భ‌వ‌, పితృదేవో భ‌వ అంటూ.. నిత్య‌మూ వారిని స్మ‌రించుకోవ‌డం భారతీయ సంప్ర‌దాయంగా వ‌స్తోంది. అయిన‌ప్ప‌టికీ.. నేటి డిజిట‌ల్ ప్ర‌పంచంలో అంతా ఒక్క‌టైన నేప‌థ్యంలో ఎక్క‌డ ఎలాంటి మంచి కార్య‌క్ర‌మం జ‌రిగినా.. అంద‌రూ ఫాలో అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version