హైదరాబాద్ నగర శివారు ప్రాంతమైన ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలోని మన్సూరాబాద్ డివిజన్ లో వీధికుక్క వీరంగమే సృష్టించింది. కనిపించిన వారినల్లా కాటు వేసింది. మన్సూరాబాద్, సహారా ఎస్టేట్, రాగాల ఎన్ క్లేవ్ కాలనీలలో నివాసం ఉండే ప్రజలు కుక్క కు భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. అప్రమత్తంగా లేని వారిని నలుగురుని కాటు వేసింది.
మరో విశేషం ఏంటంటే.. అప్రమత్తంగా ఉన్నప్పటికి దానిని దగ్గరకు రానియ్యకుండా కొట్టిన వ్యక్తిని కూడా కాటు వేసింది. రాగాల ఎన్ క్లేవ్ లో నివాసం ఉండే నల్లవెల్లి వెంకటయ్య ఎస్వీ ఫంక్షన్ హాల్ లో వాచ్ మేన్ గా విధులు నిర్వహిస్తుంటాడు. ఫంక్షన్ హాల్ ముందుకు వచ్చిన కుక్కను గమనించి అప్రమత్తంగానే ఉన్నాడు. కుక్క అక్కడి నుంచి వెళ్లినట్టే వెళ్లే వెనుక వైపు నుంచి వచ్చి కాలు పై బలంగా కరిచింది. దీంతో వెంకటయ్యకు నాలుగు కుట్లు పడ్డాయి. వెంటనే వనస్థలిపురం ఆసుపత్రికి వెళ్లగా అప్పటికే అక్కడ ఆ కుక్క మరికొంత మందిని కూడా కరిచినట్టు సమాచారం. వీధుల్లో తిరిగే కుక్కలను వెటర్నరీ అధికారులు పట్టుకొని చాలా రోజులే అవుతుంది. వెటర్నరీ అధికారులు స్పందించి వీధి కుక్కలను తరలించాలని మన్సూరాబాద్ డివిజన్ ప్రజలు కోరుతున్నారు.