బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నేతాజీ సుభాష్ చంద్ర బోస్ మునిమేనల్లుడు చంద్రబోస్ బీజేపీకి రాజీనామా చేశారు. దివంగత నేత ఆశయాలను పార్టీ నెరవేర్చనందుకు నిరసనగా పార్టీ నుంచి వైదొలుగుతున్నట్టు చంద్రబోస్ ప్రకటించారు. మతపరమైన రాజకీయాలకు, విభజన రాజకీయాలకు వ్యతిరేకమని, వాటిపై విరోచిత పోరాటం చేశారని వ్యాఖ్యానించడం గమనార్హం. 2016లో బీజేపీలో చేరిన చంద్రబోస్ 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ తరపున పోటీ చేశారు. తాను బీజేపీలో చేరినప్పుడు నేతాజీ సుభాష్ చంద్ర బోస్, శరత్ చంద్ర బోస్‌ల సిద్ధాంతాలను ప్రచారం చేసేందుకు తనను అనుమతిస్తామని చెప్పారని, కానీ ఆ దిశగా ఏం జరగలేదని చంద్రబోస్ ఆవేదన వ్యక్తం చేశారు.
2016లో బోస్‌ను పశ్చిమ బెంగాల్ ఉపాధ్యక్షుడిగా నియమించగా 2020లో పునర్వ్యవస్ధీకరణలో ఆయనకు చోటు దక్కలేదు. బీజేపీ వేదికగా దివంగత నేతల భావజాల వ్యాప్తికి దేశమంతా ప్రచారం చేయాలని భావించానని చెప్పుకొచ్చారు.బీజేపీ సిద్ధాంతాలకు అనుగుణంగా ఆజాద్ హింద్ మోర్చా స్ధాపించి కుల మతాలకు అతీతంగా నేతాజీ ఆలోచనల మేరకు అన్ని వర్గాలను భారతీయులుగా ఏకం చేయాలని అనుకున్నామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు పంపిన రాజీనామా లేఖలో ఆయన రా సుకొచ్చారు. తాను ప్రతిపాదించిన ఆలోచనలను కేంద్ర నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం పట్టించుకోలేదని, బెంగాలీలకు చేరువయ్యేందుకు తన సూచనలను కూడా పార్టీ పెద్దలు బుట్టదాఖలా చేశారని బోస్ ఆవేదన వ్యక్తం చేశారు.