మరో వివాదంలో సుయెలా బ్రేవర్మన్‌

-

బ్రిటన్‌ హోంశాఖ మంత్రి సుయెలా బ్రేవర్మన్‌ మరో వివాదంలో చిక్కుకున్నారు. బ్రిటన్‌ దక్షిణ తీరంలో శరణార్థుల తాకిడిని ఆమె.. వలసదారుల దండయాత్రగా అభివర్ణించడం దుమారం రేపింది. ఇంగ్లాండ్ దక్షిణ తీరంలోని ఓ శరణార్థుల కేంద్రంపై పెట్రోల్ బాంబు దాడి జరిగిన మరుసటి రోజే.. పార్లమెంట్‌ వేదికగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో ప్రతిపక్షాలతోపాటు స్థానిక శరణార్థ సంఘాలూ బ్రేవర్మన్‌ వ్యాఖ్యలపై ఫైర్ అవుతున్నాయి.

‘దేశంలో అక్రమ వలసలు నియంత్రణలో లేకుండా పోయాయి. ఇంగ్లీష్‌ ఛానల్ ద్వారా పెద్ద సంఖ్యలో వలసదారులు ఇక్కడికి చేరుకుంటున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు దాదాపు 40 వేల మంది ఒక్క దక్షిణ తీరానికే చేరుకున్నారు. క్రిమినల్‌ గ్యాంగ్‌ల సాయంతో వారు ఇక్కడ అడుగుపెడుతున్నారు. పైగా.. అందులో కొందరు ఆ ముఠాల సభ్యులే. కాబట్టి, వచ్చే వారందరనీ కష్టాల్లో ఉన్నవారిగా భావించడం తగదు. ప్రతిపక్షాలు మాత్రం వేరేలా వాదిస్తున్నాయి. దక్షిణ తీరంలో ‘వలసదారుల దండయాత్ర’ను కట్టడి చేసే విషయంలో ఏ పార్టీ తీవ్రంగా కృషి చేస్తుందో ప్రజలకు తెలియాలి’ అని బ్రేవర్మన్ వ్యాఖ్యానించారు.

హోం మంత్రి అత్యంత తీవ్రమైన పదజాలాన్ని ఉపయోగించారని ప్రతిపక్ష లేబర్ పార్టీ విమర్శించింది. దేశ భద్రతపై సీరియస్‌గా ఉన్న ఏ హోం మంత్రి కూడా ఇలా మాట్లాడరని లేబర్ పార్టీ నేత యివెట్ కూపర్ అన్నారు. ప్రధాని రిషి సునాక్‌ చెప్పే దయాపూరిత సంప్రదాయవాదాన్ని ఇటువంటి భాష అపహాస్యం చేస్తుందని స్కాటిష్ నేషనల్ పార్టీ పేర్కొంది. బ్రిటన్‌ శరణార్థుల మండలి కూడా బ్రేవర్మన్ వ్యాఖ్యలను ఖండించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version